2025-26 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హులైన ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీ నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్యలో వయసున్న విద్యార్థులు అర్హులు. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తులను పరిశీలించి, లాటరీలో ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను విద్యాలయం సంఘటన్ నేరుగా ఆయా కేవీఎస్లకు పంపుతుంది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయిస్తారు. విద్యార్థులకు ఎంపిక సంబంధించి తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్ 2న, మూడో జాబితా ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. నాలుగు ప్రాధాన్య అంశాలతో విద్యార్థుల ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు నాలుగో ప్రాధాన్యం కింద సీట్లు కేటాయిస్తారు. విద్యాహక్కు చట్టం కింద 10 సీట్లు ఉంటాయి. ఇందుకు పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారు మాత్రమే అర్హులు.
ముందుగా వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఎంపిక జాబితా విద్యాలయాలకు పంపుతుంది. ఆ తర్వాత జాబితాను సంబంధిత వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. జాబితాలో ఉన్నవారు మాత్రమే నిజ ధ్రువీకరణ పత్రాలతో పాఠశాలలో సంప్రదించాలి. ఆన్లైన్లోనే డ్రా విధానం అనేది ఉంటుంది. కంప్యూటరే ర్యాండమ్‌గా విద్యార్థులను ఎంపిక చేస్తుంది.
ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి : దరఖాస్తులో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధాన్య అంశాలను తప్పనిసరిగా పాటించాలని బోధన్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తు చేసేవారికి ఆయా ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని అన్నారు. ఆర్టీఐ కోటాలో సీటు పొందినప్పటికీ కేటగిరీని తప్పుగా ఎంచుకుంటే సీటు రాదన్నారు. సాధారణ ప్రజలు దరఖాస్తు చేసే క్రమంలో ఐదో కేటగిరీని ఎంచుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.