‘ఆపరేషన్‌ సింధు’ మొదలైంది..: భారత విదేశాంగ శాఖ ప్రకటన

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతుండటంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.


దీనికి ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) అని నామకరణం చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ.. ఉత్తర ఇరాన్‌ నుంచి జూన్‌ 17న ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది విద్యార్థులను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వీరంతా ఆర్మేనియా రాజధాని యెరవాన్‌ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు బయల్దేరారు. జూన్‌ 19న తెల్లవారు జామున న్యూదిల్లీకి చేరుకోనున్నారు. విదేశాల్లో ఉన్న తన పౌరుల భద్రతకు భారత్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

ఇజ్రాయెల్‌ దాడులతో టెహ్రాన్‌ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత ఎంబసీ ఇప్పటికే ప్రత్యేక అడ్వైజరీని జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని కోరింది. టెహ్రాన్‌ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్‌ అవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

దిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరస్పర దాడుల నేపథ్యంలో ఆ రెండు దేశాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ప్రారంభించింది. ఇప్పటివరకూ రాష్ట్ర వాసులు ఎవరూ ప్రభావితం అయినట్లు సమాచారం లేకపోయినా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్తగా ఈ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా తాము ఉంటున్న దేశాల్లో గానీ, ప్రయాణాల్లో గానీ ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులు కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. వందన- రెసిడెంట్‌ కమిషనర్‌ పీఎస్‌- +91 9871999044, జి.రక్షిత్‌నాయక్, లైజన్‌ ఆఫీసర్‌- +91 9643723157, జావేద్‌ హుస్సేన్, లైజన్‌ ఆఫీసర్‌- +91 9910014749, సీహెచ్‌ చక్రవర్తి, పౌరసంబంధాల అధికారి- +91 9949351270.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.