RBI News: తగ్గిన హోమ్‌లోన్, కారు లోన్ ఈఎంఐలు.. నెలకు ఎంత ఆదా అంటే..?

RBI Rate cut Impact: ఇవాళ రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. కీలక వడ్డీ రేటైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తు్న్నట్లు ప్రకటించారు.


దీంతో రెపో రేటు ప్రస్తుతం 6 శాతానికి చేరుకుంది. అయితే బ్యాంకులు ఆర్థిక సంస్థలు తమ ఫ్లోటింగ్ రేట్ పాలసీ ప్రకారం తగ్గించబడిన వడ్డీ రేటు ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. దీనికి తోడు కొత్తగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ కోసం చూస్తున్న వ్యక్తులు రుణాలను సులువుగా పొందటానికి అవకాశం లభిస్తుంది.

ఇప్పటికే హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ పొందిన వ్యక్తులు ఫ్లోటింగ్ రేటు కింద ఉన్నట్లయితే వారి నెలవారీ ఈఎంఐ చెల్లింపుల్లో తగ్గింపును పొందుతారు. అయితే లోన్ కాలపరిమితిని తగ్గించుకోకుండా కొనసాగాలకునే వ్యక్తులు ప్రయోజనాన్ని అందుకుంటారు. కొందరు తమ ప్రస్తుత ఈఎంఐ మెుత్తాలను అలాగే కొనసాగిస్తూ లోన్ కాలాన్ని తగ్గించుకుంటారు. అలాంటి వ్యక్తులకు ఈఎంఐ భారం తగ్గదు కానీ చెల్లింపు కాలం తగ్గుతుంది.

రెపో రేటు మార్పుతో నెలవారీ ఈఎంఐ ఎంత తగ్గుతుంది..?
ఉదాహరణకు ఒక వ్యక్తు బ్యాంక్ నుంచి రూ.50 లక్షలు హోమ్ లోన్ 30 ఏళ్ల కాలానికి 8.7 శాతం వడ్డీ రేటు చొప్పున పొందాడనుకుంటే. దీని ప్రకారం సదరు వ్యక్తి ఇప్పటికే ప్రతి నెల రూ.39వేల 157 ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటారు. అయితే నేడు రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు రెపోను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినందున రుణగ్రహీత చెల్లించే వడ్డీ రేటు అదే స్థాయిలో తగ్గి 8.45 శాతానికి చేరుకుంటుంది. దీని కారణంగా వారి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ రూ.37వేల 388కి తగ్గుతుంది. అంటే నెలకు రూ.888 ఈఎంఐ భారం తగ్గుతుంది. ఏడాదికి వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి రూ.10వేల 656 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇదే తరహాలో ఆటో లోన్స్ పొందిన వ్యక్తులు సైతం తమ ఈఎంఐ తగ్గింపులను చూస్తారు. అలాగే పర్సనల్ లోన్ 12 శాతం చొప్పున ఎవరైనా వ్యక్తి ఐదేళ్ల కాలానికి.. రూ.5 లక్షలు తీసుకుంటే తాజా వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా అతను నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.11వేల 282 నుంచి రూ.11వేల 149కి తగ్గుతుంది. అంటే ప్రతి నెల ఈఎంఐ భారం రూ.133 మేర తగ్గుతుంది. అయితే తాజా వడ్డీ రేట్ల తగ్గింపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి షాక్ అని చెప్పుకోవచ్చు. బ్యాంకులు ఇకపై వివిధ కాలాలకు చేసే డిపాజిట్ల వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటిస్తాయి.