వరుస ఓటముల నుంచి అనూహ్యంగా ప్లేఆఫ్స్​కు.. RCB సక్సెస్ వెనుక అదృశ్య శక్తి!

www.mannamweb.com


ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయింది ఆర్సీబీ. ఆడిన మొదటి ఎనిమిది మ్యాచుల్లో ఏడింట ఓడి దారుణమైన విమర్శల్ని మూటగట్టుకుంది. ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇక చేసేదేమీ లేదని, అంతా ముగిసిందనుకొని బ్యాగులు సర్దుకున్నాడట. కానీ ఇక్కడే అద్భుతం చోటుచేసుకుంది. ఒక దశలో పాయింట్స్ టేబుల్​లో చివర్లో ఉండకపోతే గొప్పని అనుకున్న ఆర్సీబీ.. పట్టుదలతో ఆడుతూ ఇప్పుడు ఏకంగా ప్లేఆఫ్స్​లోకి అడుగు పెట్టింది. సీఎస్​కే వంటి టాప్ టీమ్​ను నాకౌట్ పోరులో చిత్తు చేసి ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది డుప్లెసిస్ సేన. అయితే వరుస ఓటముల నుంచి అనూహ్యంగా క్వాలిఫై అవడం వరకు బెంగళూరు సక్సెస్ వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేసింది.

ఈ సీజన్ ఫస్టాఫ్​లో ఎంత బాగా ఆడినా ఆర్సీబీ ఓడిపోతుండటంతో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ కూడా డల్ అయ్యాడు. ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతున్న దినేష్ కార్తీక్ కూడా తమ జట్టు రాత ఇంతే అని నిరాశలో కూరుకుపోయాడు. ఈ టీమ్​ ఫేట్ మార్చడం తన వల్ల కాదని కెప్టెన్ డుప్లెసిస్ కుంగిపోయాడు. ఈ టైమ్​లో ఓ అదృశ్య శక్తి ఎంట్రీ ఇచ్చింది. ఆ సీక్రెట్ పవరే బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. మీ వల్ల అవుతుంది అంటూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేశాడు ఆండీ. 1 శాతం అవకాశాన్ని కూడా 100 శాతం వరకు తీసుకెళ్లొచ్చంటూ వాళ్లలో మనోధైర్యం నింపాడు. మీరు ప్రపంచాన్నే జయించగలరు.. ఇదో లెక్కా అంటూ వాళ్లలోని పౌరుషాన్ని బయటకు తీశాడు. అంతే ఆర్సీబీ ప్లేయర్లు చెలరేగిపోయారు.

కోచ్ ఆండీ ఫ్లవర్ చెప్పినట్లు ప్రతి మ్యాచ్​ను డూ ఆర్ డైగా తీసుకున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. దూకుడే మంత్రంగా చెలరేగిపోయారు. ఎదురొచ్చిన ప్రతి జట్టును తొక్కిపడేస్తూ ముందుకెళ్లారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఏదైనా సరే, అటాకింగ్ మోడ్​లోనే ఆడుతూ అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టడం స్టార్ట్ చేశారు. నిన్న సీఎస్​కేను కూడా ఇలాగే ఆడి వణికించారు. ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకుంటూ అద్భుతాలు సృష్టించడం ఎలాగో బాగా తెలిసిన కోచ్ ఆండీ.. జట్టు కూర్పును బాగా సెట్ చేశాడు. సరిగ్గా పెర్ఫార్మ్ చేయని మ్యాక్స్​వెల్, సిరాజ్​ లాంటి వారికి రెస్ట్ ఇచ్చి స్వప్నిల్, కర్ణ్​ శర్మ, విల్ జాక్స్​ను టీమ్​లోకి దించాడు. వాళ్లు గ్రాండ్ సక్సెస్ అయ్యారు.

కొంత గ్యాప్ తర్వాత సిరాజ్​ను జట్టులోకి తీసుకుంటే అతడూ అదరగొట్టాడు. నిన్నటి మ్యాచ్​లో మ్యాక్స్​వెల్ బ్యాట్​తో, బంతితో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఎవర్ని ఎప్పుడు ఆడించాలి, వాళ్లలోని బెస్ట్​ పెర్ఫార్మెన్స్​ను ఎలా బయటకు తీయాలో తెలిసిన ఆండీ ఫ్లవర్ టీమ్ అవసరాలకు తగ్గట్లు అందర్నీ వాడుకున్నాడు. ఐపీఎల్​లో ఆర్సీబీకే కాదు.. పీఎస్​ఎల్, సీపీఎల్, హండ్రెడ్ లీగ్, ఐఎల్​టీ20 లీగ్స్​లో ఇతర జట్లకూ కోచింగ్ ఇస్తూ ఎంతో అనుభవం గడించాడాయన. దాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ బెంగళూరు సక్సెస్​కు కారణం అవుతున్నాడు.