Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి..

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు.


ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం సైఫ్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడని సమాచారం. అదే సమయంలో అతడిని సైఫ్ అడ్డగించడంతో అతడిపై దొంగ దాడికి పాల్పడ్డాడని.. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఇంట్లోకి దొంగ రావడంతో కొంతమంది సేవకులు నిద్ర నుంచి మేల్కొన్నారు. ఇంట్లో శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కోన్న సైఫ్ బయటకు వచ్చి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ దొంగ సైఫ్ పై కాత్తితో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఘటన అనంతరం దొంగ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ తీవ్రంగా గాలిస్తున్నారు.