Viral: చనిపోయిన 20 ఏళ్ల తర్వాత కొడుకు కలలోకొచ్చిన తండ్రి.. సమాధి తవ్వితే ఊహించని సీన్..

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రియమైన వ్యక్తులను కోల్పోతే, ఆ బాధ జీవితాంతం ఉంటుంది. అలా చనిపోయిన తల్లిదండ్రులు కలలో కనిపించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
అయితే ఒక కొడుక్కి, చనిపోయిన తన తండ్రి 20 ఏళ్ల తర్వాత కలలో కనిపించాడు. ఆ కలలో తన సమాధి దుస్థితి చెబుతూ, బాగు చేయమని వేడుకున్నాడు. అది కొడుకు మనసును కలచివేసింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్దకు చేరుకున్న కొడుకు, దాన్ని తవ్వి చూడగా అక్కడ కనిపించిన సీన్ చూసి ఊరంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది.


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కౌశాంబి జిల్లాలోని దారానగర్‌లో 2023, అక్టోబర్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. అక్తర్ సుభానీ అనే వ్యక్తికి 20 ఏళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి మౌలానా అన్సార్ అహ్మద్ కలలో కనిపించాడు. తన సమాధి పాడైపోయిందని, నీళ్లు, మట్టి లోపలికి చేరుతున్నాయని, దాన్ని బాగు చేయించాలని కొడుకుతో మొరపెట్టుకున్నాడు. ఇలాంటి కలలు రెండు మూడు సార్లు వచ్చాయట.

సమాధిని తవ్వుతుండగా..
ఒక రోజు ఉదయం లేచిన వెంటనే అక్తర్ ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. అందరూ కలిసి వెంటనే ఊరి చివర ఉన్న స్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ మౌలానా అన్సార్ సమాధి నిజంగానే శిథిలావస్థకు చేరుకొని ఉండటం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక, బరేల్వి వర్గానికి చెందిన ఓ మత పెద్దను సంప్రదించారు. ఆయన సమాధిని బాగు చేయవచ్చని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే పనుల్లో నిమగ్నమయ్యారు.

సమాధిని తవ్వుతుండగా ఊరిలోని చాలామంది గుమిగూడారు. అందరూ కలిసి చాలా జాగ్రత్తగా తవ్వుతుండగా ఒక ఊహించని దృశ్యం కనిపించింది. అంతే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మౌలానా అన్సార్ అహ్మద్ మృతదేహం 20 ఏళ్లు గడిచినా ఏమాత్రం చెక్కుచెదరకుండా, కుళ్లిపోకుండా ఉంది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ అద్భుతాన్ని కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు.

ఇది దేవుడి మహిమా?
ఈ సంచలన దృశ్యాన్ని చూసిన తర్వాత కుటుంబ సభ్యులు మౌలానా అన్సార్ మృతదేహాన్ని శుభ్రం చేసి, మళ్లీ భక్తిశ్రద్ధలతో ఖననం చేశారు. తర్వాత సమాధిని మరింత బలంగా నిర్మించారు. సాధారణంగా మృతదేహం ఇన్నేళ్ల తర్వాత కుళ్లిపోతుందని అందరూ భావిస్తుంటారు. కానీ, మౌలానా అన్సార్ మృతదేహం చెక్కుచెదరకుండా ఉండటం చూసి స్థానికులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఈ ఘటన ఊరంతా చర్చనీయాంశంగా మారింది. దేవుడి మహిమ అంటూ కొందరు, అద్భుతం అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మౌలానా అన్సార్ మృతదేహం కుళ్లిపోకుండా లేదంటే మట్టిలో కలిసిపోకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. సాధారణంగా, మరణించిన తర్వాత బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల శరీరం కుళ్లిపోతుంది. కానీ కొన్నిసార్లు, పర్యావరణ పరిస్థితులు, వ్యక్తి శరీరం, ఖననం చేసిన విధానం వంటి అంశాల వల్ల ఈ ప్రక్రియ నెమ్మదించవచ్చు లేదా ఆగిపోవచ్చు.

కొన్నిసార్లు శరీరంలోని కొవ్వు రసాయన చర్య జరిగి, సబ్బు (Saponification)/ మైనంలాంటి పదార్థంగా మారుతుంది. ఇది శరీరం కుళ్లిపోకుండా కొంతకాలం కాపాడుతుంది. సమాధి ఉన్న ప్రదేశం పొడిగా, చల్లగా ఉంటే కుళ్లిపోయే ప్రక్రియ నెమ్మదిస్తుంది. గాలి తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇదే జరుగుతుంది. వ్యక్తి శరీరంలో తక్కువ నీరు ఉండటం లేదా కొన్ని రకాల వ్యాధులు ఉండటం వల్ల కూడా కుళ్లిపోవడం ఆలస్యం కావచ్చు. గట్టిగా మూసివున్న శవపేటికలో ఖననం చేయడం వల్ల గాలి తగలక కుళ్లి పోవడం ఆలస్యం కావచ్చు అని కొందరు అంటారు.