ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ తెలుసా?

ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. కొన్ని బ్యాంకులు శాలరీ ఖాతాలు ప్రారంభించే సంస్థలు, ఉద్యోగులకు మంచి ఆఫర్లను ఇస్తున్నాయి.


ఈ ఆఫర్ల గురించి మీకు తెలుసా? అవి ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా SBIలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి మంచి ఆఫర్లున్నాయి. ఈ శాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఖాతా. దేశంలో ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉచితమే.

ఈ ఖాతా కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 40 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాదబీమా పొందొచ్చు. దీనికితోడు 1 కోటి రూపాయాలు ఉచిత విమాన ప్రమాద భీమా కూడా అందిస్తుంది. ఇదే బ్యాంకులో లాకర్లు తీసుకుంటే సంవత్సరానికి లాకర్ పై 50 శాతం తగ్గింపు ఇస్తారు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ తో పాటు, ఆటో స్వైప్ ప్రయోజనం కూడా అందిస్తుంది.

డీమాట్, ఆన్ లైన్ ట్రేడింగ్ ఖాతాలను కూడా అందించనుంది. నెఫ్ట్,ఆర్ టీ జీ ఎస్ ద్వారా లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేయరు.డెబిట్ కార్డుతో పాటు యోనో యాప్ పై ఎస్ బీ ఐ అందించే అన్ని సాధారణ ఆఫర్లను కూడా పొందొచ్చు. వీటికి తోడు ఎడ్యుకేషన్, హౌసింగ్ లోన్, కారు కోసం రుణాలు పొందొచ్చు. శాలరీ అకౌంట్ ఉండడంతో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు పెద్దగా ఆలోచించరు. రుణాల మంజూరు కోసం అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు.

శాలరీ అకౌంట్లలో ప్రతి నెల వేతనం జమ కాకపోతే ఆ ఖాతాకు శాలరీ ఖాతాకు ఇచ్చే ఆఫర్లు అందవు. వరుసగా మూడు నెలలు శాలరీ జమ కాకపోతే ఆ ఖాతాను శాలరీ ఖాతాగా పరిగణించరు. ఉద్యోగాలు మారిన సమయంలో గతంలో కొనసాగిన శాలరీ ఖాతాను కొనసాగించేందుకు కొత్త సంస్థ కూడా అంగీకరిస్తే అదే ఖాతాలో శాలరీ జమ చేసుకొనేలా చూసుకోవాలి. అప్పుడు ఇబ్బందులు రావు.