February 26, 27 రెండ్రోజులు సెలవే… తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎక్స్ట్రా హాలిడేస్ ఎందుకు?

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల అదనంగా మరో సెలవు రానుంది. అదికూడా శివరాత్రి సెలవుతో కలిసిరానుంది. ఇలా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో తెలుగు విద్యార్థులకు సెలవు వుండనుంది.


MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే న్యూఇయర్, సంక్రాంతి అంటూ విద్యార్థులకు చాలా సెలవులు వచ్చాయి. ఇలా గత నెల జనవరి మొత్తం సెలవులకే సరిపోయింది. ఈ నెలలో (ఫిబ్రవరి) కేవలం ఆదివారాలు తప్ప సెలవులేమీ లేవు … కేవలం నాలుగు ఆదివారాలతో పాటు శివరాత్రి సెలవు మాత్రమే వున్నాయి. అయితే తాజాగా ఫిబ్రవరి సెలవుల జాబితాలో మరో హాలిడే చేరే అవకాశం వుంది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి నామనేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికలు జరిగే జిల్లాలోని స్కూళ్లకు పోలింగ్ రోజున సెలవు వుండనుంది.

గతంలో టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించిన సందర్భాలు వున్నాయి. కాబట్టి ఈసారి కూడా అలాగే చేయనున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులు, స్కూల్ టీచర్లు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలంటే సెలవు తప్పనిసరి. కాబట్టి ఫిబ్రవరి 27న పోలిండ్ డే హాలిడే వుంటుంది.

ఫిబ్రవరి 26, 27 రెండ్రోజులు సెలవే :

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి… చాలామంది ఉపవాస దీక్ష పాటిస్తారు. శ్రీశైలం, వేములవాడ వంటి శైవక్షేత్రాల్లో శివరాత్రికి ప్రత్యేక పూజలు, ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే శివరాత్రి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారిక హాలిడే వుంది.

అయితే ఆ తర్వాతి రోజే తెలంగాణతో పాటు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వుంటుంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్, టీచర్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే వరంగల్-ఖమ్మం‌-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణలో ఈ జిల్లాల్లో సెలవు వుండనుంది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడకూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి తో పాటు కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే విజయనగరం‌-శ్రీకాకుళం-విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు వుంటుంది.

ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 27న సెలవు వుండనుంది. పాఠశాలలు, కాలేజీల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు… అలాగే ఈ ఎన్నికల్లో ఓటర్లంతా గ్రాడ్యుయేట్లు, టీచర్లు… కాబట్టి విద్యాసంస్థలకు సెలవు ఇస్తారు. ఇలా శివరాత్రి పండగవేళ వరుసగా రెండ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ :

తెలంగాణలో మూడు, ఆంధ్ర ప్రదేశ్ లో మూడు… మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

షెడ్యూల్ :

ఫిబ్రవరి 3 : నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఫిబ్రవరి 10 : నామినేషన్ దాఖలుకు చివరితేదీ.

ఫిబ్రవరి 11 : నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 13 : నామినేషన్ల ఉపసంహరణ

ఫిబ్రవరి 27 : పోలింగ్

మార్చి 3 : ఓట్ల లెక్కింపు