స్వయం ఉపాధి రుణాలకు ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలు

యూనిట్‌ వ్యయంలో 50% రాయితీ, మిగతా మొత్తం బ్యాంకు రుణం


ఈనాడు, అమరావతి: వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీనవర్గాల్లో పేదరికాన్ని రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసింది. 2024-25 ఏడాదికిగానూ రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు రూ. 896 కోట్లు, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు రూ. 384 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఈ నిధుల వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు.. వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59 వేల మంది ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు లబ్ధి చేకూరనుంది. గతంలో రాయితీ రుణాల మంజూరు పథకంలో ఎంపికైన వారు ‘లబ్ధిదారు వాటా’ కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చేది. ఆపై కొంత సొమ్మును ప్రభుత్వం రాయితీపై ఇచ్చేది. మరికొంత బ్యాంకు రుణంగా ఇప్పించేది. తాజా మార్గదర్శకాల్లో లబ్ధిదారు వాటాను తొలగించింది. యూనిట్‌ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోనూ, మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందించనుంది. గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా పథకం పక్కాగా అమలయ్యేలా యూనిట్లకు జియోట్యాగింగ్‌ చేయించనుంది. పూర్తిస్థాయిలో గ్రౌండింగ్‌ అయ్యిందీ, లేనిదీ పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలను నియమించనుంది.

దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌

స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెనిఫిషియరీ మానిటరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఓబీఎంఎంఎస్‌) అనే వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది. దీనిద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో సొంతంగానూ దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎంపీడీవో/ మునిసిపల్‌ కమిషనర్లకు అప్పగించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇందుకు సహకరిస్తారు. దరఖాస్తుల పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే, వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేలా నిర్దేశిత లక్ష్యం కంటే అదనంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు డాక్యుమెంటేషన్‌ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీవో/ మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలోనే పూర్తి చేయనున్నారు.

రాయితీ సొమ్ము బ్యాంకులకు జమ

ఎంపికైన లబ్ధిదారుల రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకు జమ చేయనుంది. యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను లబ్ధిదారులు బ్యాంకుకు సమర్పించిన వెంటనే వారు కొనుగోలు చేసిన దుకాణానికి రాయితీ, బ్యాంకు రుణం మొత్తం జమ చేయనున్నారు. యూనిట్లు మంజూరైన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మేళాలు నిర్వహించి, అందజేస్తారు. లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపును పర్యవేక్షించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరికి అప్పగించనున్నారు.

అర్హతకు ప్రమాణాలివే..

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు
వయసు: 21 నుంచి 60 ఏళ్ల మధ్య
రుణ పథకాలకు వర్తించే యూనిట్లు

1. మినీ డెయిరీ యూనిట్స్‌

2. గొర్రెలు, మేకల పెంపకం

3. మేదర, కుమ్మరి/ శాలివాహన కుటుంబాలకు ఆర్థిక సాయం

4. వడ్రంగి పనివారికి చేయూత

5. జనరిక్‌ దుకాణాలు

శిక్షణ కార్యక్రమాలు..

1. ఫ్యాషన్‌ డిజైనింగ్‌/ టైలరింగ్‌

2. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

3. ఆతిథ్య రంగం