లిక్కర్ కుంభకోణం(Liquor Scam)పై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విజయవాడ(Vijayawada)లో మీడియాతో మాట్లాడారు.
లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి రెండూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే(Kasireddy Rajasekhar Reddy) అని కుండబద్దలు కొట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా అని హాట్ కామెంట్స్ చేశారు. ”భయం అనేది నా బ్లెడ్‌లోనే లేదు. ఎవరికీ భయపడే రకం కాదు. గతంలో నాయకుడిపై భక్తి, గౌరవం ఉండేది.. ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది. జగన్ నాకు పదవులు ఇచ్చాడు కాదనను.. కానీ ఆ పార్టీలో అనేక అవమానాలు పడ్డాను. కోటరీ వల్లే నేను జగన్(Jagan)కు దూరమయ్యాను. జగన్ మనసులో నాకు చోటు లేదని తెలిసాకే వీడాలని నిర్ణయించుకున్నాను. కోటరీ మాటలు వినొద్దని అనేకసార్లు జగన్‌కు చెప్పాను. అయినా వినలేదు” అని విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, అంతకుముందు ఏపీ సీఐడీ(AP CID) విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు(Kakinada Port) అక్రమాల కేసులో ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. గత వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (KV Rao) నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా, ఇవాళ ఆయన హాజరయ్యారు.