Sripriya Mandahasini: అమెరికాలో తెలుగుదనం

ఆటలూ, పాటలూ ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి? అయితే, ఓ నేస్తం మాత్రం ఆసక్తి కొద్దీ కళల్లో అద్భుత ప్రతిభ చూపుతోంది. విదేశాల్లో ఉంటున్నా.. తెలుగు భాష, సంప్రదాయాలను తను మర్చిపోవట్లేదు. ఇంతకీ తనెవరంటే..


ఆటలూ, పాటలూ ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి? అయితే, ఓ నేస్తం మాత్రం ఆసక్తి కొద్దీ కళల్లో అద్భుత ప్రతిభ చూపుతోంది. విదేశాల్లో ఉంటున్నా.. తెలుగు భాష, సంప్రదాయాలను తను మర్చిపోవట్లేదు. ఇంతకీ తనెవరంటే..

హైదరాబాద్‌కు చెందిన భట్టిప్రోలు శ్రీప్రియ మందహాసినికి పదిహేనేళ్లు. వాళ్ల నాన్న పవన్‌కుమార్‌ ఓ బయోటెక్‌ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌. అమ్మ పద్మజ గృహిణి. ప్రస్తుతం వీళ్లంతా అమెరికాలో ఉంటున్నారు. హాసిని చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మతో కలిసి కర్ణాటక సంగీతానికి సంబంధించిన పాటలు వినేది. క్రమంగా వాటి మీద ఆసక్తి పెరిగి, పాడటం ప్రారంభించింది. సంగీతం మీద తన ఆసక్తిని చూసి.. అమ్మానాన్నలు నాలుగేళ్ల వయసులోనే శిక్షణలో చేర్పించారు. నిరంతర సాధనతో పాడటంలో పట్టు సాధించింది. సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిర్వహించే తెలుగు భాష కోర్సుల్లోనూ ఉత్తీర్ణత సాధించింది. సిలికానాంధ్ర అన్నమయ్య సంగీత పురస్కారం, ఎనిమిదేళ్ల వయసు నుంచే త్యాగరాజ ఆరాధనోత్సవ అవార్డులు.. ఇలా బోలెడు ప్రశంసలు అందుకుంది. వయోలిన్, వెస్టర్న్‌ సంగీతం, భరతనాట్యం, పోతన పద్యాల్లోనూ ప్రతిభ చూపుతోంది. ఇప్పటికే అనేక ట్రోఫీలతోపాటు ప్రశంసా పత్రాలూ సాధించింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాట్య ప్రదర్శనతో అందరినీ అలరించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు నుంచి పురస్కారం అందుకుంది. భవిష్యత్తులో వైద్యురాలిగా సేవలందిస్తూ.. సంగీత ప్రపంచంలో కొనసాగాలన్నదే హాసిని లక్ష్యమట.