Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ‘ఐఐటీ బాబా’!

మహా కుంభమేళాలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు.


ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ (Kumbh Mela)లో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతోపాటు సాధువులు, విదేశీ పర్యటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వారిలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ‘ఐఐటీ బాబా’గా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు.

అభేయ్‌ సింగ్‌ స్వస్థలం హరియాణా. ఐఐటీ-బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసినట్లు ఆయన చెబుతున్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం.. కొంతకాలం కార్పొరేట్‌లో పనిచేసిన ఆయన.. దాన్ని వదులుకొన్నారు. ఫొటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. తాజాగా మహా కుంభమేళాకు వచ్చిన ఆయన.. ఓ వార్తా ఛానెల్‌ ఇంటర్వ్యూతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఐఐటీ బాబా, ఇంజినీర్‌ బాబాగా నెటిజన్లు ఆయన్ను పేర్కొంటున్నారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పడం విశేషం.

ప్రధాన ఆకర్షణగా హర్ష్‌ రిచారియా..

మహా కుంభమేళాలో ఓ మహిళ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆమే హర్షా రిచారియా (Harsha Richhariya). స్వస్థలం ఉత్తరాఖండ్‌. సంప్రదాయ వస్త్రధారణ, తిలకం, రుద్రాక్షమాలతో ఉన్న ఆమెను కుంభమేళాకు వచ్చిన వారంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. మీడియాలో ఇంటర్వ్యూలతో మరింత పాపులర్‌ అయ్యారు. ఆమె ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు వైరల్‌గా మారాయి. కుంభమేళాకు వచ్చినవారంతా ఆమెను మహిళా సాధ్విగా పేర్కొంటుండగా.. తాను సాధ్విని కాదని, కేవలం మంత్రాలు మాత్రమే జపిస్తున్నానని రిచారియా స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని నిరంజనీ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్‌ స్వామి కైలాసానంద్‌ గిరి జీ మహారాజ్‌ శిష్యురాలిగా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు.

మరోవైపు, యాపిల్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs) సతీమణి లారీన్‌ పావెల్‌ జాబ్స్‌ కూడా మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) హాజరైన విషయం తెలిసిందే.