జాబ్‌లో చేరిన తొలి రోజునే రాజీనామా చేసిన ఓ ఐటీ ఉద్యోగికి కంపెనీ భారీ షాకిచ్చింది. రూ.5 లక్షల పరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది.
దీంతో, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన సదరు ఐటీ ఉద్యోగి సలహాల కోసం నెటిజన్లను ఆశ్రయించారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో చెప్పండని అభ్యర్థించారు.
‘రిక్రూట్‌మెంట్, ఆన్‌బోర్డింగ్ పూర్తయ్యాక ఆ సంస్థలో పనిచేయడం నాకు కుదరదని అనిపించింది. దీంతో, ఈ విషయాన్ని అనధికారికంగా యాజమాన్యానికి చెప్పి జాబ్ మానేశాను. విషయం అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. నేను శాలరీ కానీ, కంపెనీ వనరులు కానీ వినియోగించుకోలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదని అనుకున్నాను. కానీ వాళ్లిప్పుడు నోటీసులు పంపించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అని రెడిట్‌లో పోస్టు పెట్టారు. కంపెనీలో నోటీసు పీరియడ్ మేరకు పనిచేయలేదు కాబట్టి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.
దీనికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఉద్యోగికి శిక్షణ కోసం కంపెనీ డబ్బు వెచ్చించని సందర్భాల్లో తొలి రోజు రాజీనామా చేసినా ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదని కొందరు అన్నారు. బాండ్ ఎన్‌ఫోర్సబుల్ కాదని తెలిపారు. చట్టాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో కంపెనీలు రెచ్చిపోతున్నాయని అన్నారు. నోటరీ పేపర్‌పై ఉద్యోగి సంతకం చేస్తే మినహా ఈ బాండ్స్ చెల్లుబాటు కావని చెప్పుకొచ్చారు. ఆ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్టబద్ధంగా కంపెనీ ఏమీ చేయలేదని భరోసా ఇచ్చారు.
జాయినింగ్ లెటర్‌పై ఉద్యోగి సంతకం చేస్తే కంపెనీలకు చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు ఉంటుందని కొందరు అన్నారు.