తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ దేవ సేన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నికల్ ట్రైనింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు ఇవ్వనున్నారు.
త్వరలోనే కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. కౌన్సిలింగ్ దశల్లో విద్యార్థులు ఆప్షన్ ఎంట్రీ, సీటు అలాట్‌మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను అమలు చేసింది. రాష్ట్ర విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పాలిటెక్నిక్ సీట్లు మొత్తం తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
టీజీ పాలిసెట్ (TG POLYCET) పరీక్షను మే 13న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 98,858 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 92.64% గా నమోదైంది. పరీక్ష నిర్వహించిన తర్వాత కేవలం 10 రోజుల్లో ఫలితాలు విడుదల కావడం గమనార్హం.