Uggani Or Borugula Upma : చాలా మంది ఉదయం రకరకాల టిఫిన్లను చేస్తుంటారు. కొందరికి ఇడ్లీ అంటే ఇష్టం ఉంటుంది. కొందరు దోశలను అమితంగా లాగించేస్తారు. ఇంకా కొందరు పూరీలు అంటే ఇష్టపడతారు.
అయితే వాస్తవానికి ఇవే కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన టేస్టీ టిఫిన్లు కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఉగ్గాని. దీన్నే బొరుగుల ఉప్మా లేదా మరమరాల ఉప్మా అని కూడా పిలుస్తారు. అయితే కాస్త శ్రమిస్తే చాలు హోటల్ రుచితో దీన్ని మనం ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. పైగా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొరుగులు లేదా మరమరాలు – 8 కప్పులు, ఉల్లిపాయ – 1 పెద్దది, బాగా తరగాలి, పచ్చి మిర్చి – 3, మధ్యలో సన్నగా చీరాలి, టమాటా -1, పసుపు – పావు టీస్పూన్, వేయించిన శనగలు (పుట్నాల పప్పు) – 3 టేబుల్ స్పూన్లు, తురిమిన కొబ్బరి – 1 టేబుల్ స్పూన్, నిమ్మ రసం – 1 టీస్పూన్, పొట్టు తీసి వేయించిన పల్లీలు – గుప్పెడు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – కొద్దిగా (అలంకరణ కోసం), ఆవాలు – పావు టీస్పూన్, జీలకర్ర – పావు టీస్పూన్, మినప పప్పు – ఒకటింపావు టీస్పూన్, కరివేపాకులు – 1 రెమ్మ.
ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా తయారీ విధానం..
ముందుగా బొరుగులను నీటిలో నానబెట్టాలి. అనంతరం నీటిని వంపేయాలి. ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులోనే ఆవాలు, మినప పప్పు, పుట్నాలు, పల్లీలు వేసి వేయించాలి. అవి గోధుమ రంగులోకి మారాక అందులో కరివేపాకులు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, పసుపు వేసి అవి పారదర్శకంగా మారే వరకు వేయించాలి. అనంతరం తరిగిన టమాటా, ఉప్పు వేసి అవి మెత్తగా ఉడికే వరకు వేయించాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మరమరాలు, వేయించిన పుట్నాల పప్పు పొడి, కొత్తిమీర ఆకులు, నిమ్మరసం వేసి కలపాలి. కొన్ని నిమిషాల పాటు వాటిని కలుపుతూ వేయించాలి. తరువాత కొత్తిమీర ఆకులు వేసి గార్నిష్ చేయాలి. అంతే.. వేడి వేడి ఉగ్గాని రెడీ అవుతుంది. దీన్ని రాయలసీమ స్టైల్‌లో ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీన్ని పచ్చి ఉల్లిపాయలతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.