Chandrababu: అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు

కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం
గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని వ్యాఖ్య


అమరావతి: రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర, ప్రజావ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లకూ కీలకపాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ‘నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేనెప్పుడూ మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్లీ మీతో వివరంగా మాట్లాడతాను’ అని వారికి స్పష్టంచేశారు. వ్యవస్థలను మళ్లీ పరిపాలన గాడిలో పెడతానని అన్నారు.

గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తనకు అభినందనలకు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి ఐదారు నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టుపట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. ‘గత ఐదేళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారు’ అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆయనను మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్టులయ్యారు. చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్ఛాలతో వచ్చిన అధికారులందరినీ సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక చంద్రబాబు ఆ మందిరంలోకి వెళ్లారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరుపొందిన శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌ వంటివారు ముందు వరుసలో, ఆయనకు సమీపంలోనే కూర్చున్నారు.

మీరే ఆత్మవిమర్శ చేసుకోండి..
చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రిని అయ్యాను. ఇక్కడున్న అధికారుల్లో కొందరు అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచారు. కానీ గత ఐదేళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో గత ఐదేళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్లీ పరిపాలన గాడిలో పెడతాను. వచ్చే ఒకటి రెండు రోజులు పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెడతాను’ అని చంద్రబాబు తెలిపారు. ఆయన తాను చెప్పాలనుకున్న విషయాల్ని సూటిగా చెప్పేసి సమావేశాన్ని ముగించారు.

అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వెళుతుండగా అనుమతిలేదంటూ అధికారులు వారిని సమావేశమందిరంలోనే కూర్చోబెట్టారు.