ఉద్యోగుల భవిష్య నిధి లెక్కలేవి ?

నాలుగేళ్లుగా విడుదల కాని పీఎఫ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌


ఉద్యోగి జీతం నుంచి మినహాయించిన సొమ్ముపై ఆందోళన

ప్రతినెలా సుమారు రూ.3 కోట్ల నుంచి 5 కోట్లు సొమ్ము మినహాయింపు

నాలుగేళ్లలో సుమారు రూ.240 కోట్ల సొమ్ముకు జమాఖర్చులు నిల్‌

బ్యాలెన్స్‌ షీట్‌ లేకపోవడంతో రుణ దరఖాస్తులకు అవకాశం లేదు

పదవీ విరమణ చేసే ఉద్యోగికి దక్కని బ్యాలెన్స్‌ షీట్స్‌

నిడమర్రు, జూన్‌ 13 : తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగులు దాచుకొన్న సొమ్ము ఉందో లేదో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము దాచుకొంటున్న సొమ్ము తమ ఖాతాల్లో ఎంతవరకు జమయ్యాయో లేదో తెలియని పరిస్థితి. నెల వారీగా తమ జీతం నుంచి మినహాయించిన సొమ్ము తమ పీఎఫ్‌ ఖాతాల్లోకి జమ అవుతోందో లేదో అని ఉమ్మడి పశ్చిమ జిల్లాలో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు తమ బ్యాలెన్స్‌ షీట్లు చూసుకొనే ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ చేయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి జీత భత్యాల నుంచి సుమారు రూ.6 వేల నుంచి రూ. 15 వేల వరకు సొమ్ము మినహాయించబడి సదరు డ్రాయింగ్‌ అథారిటీ ద్వారా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గల ప్రావిడెంట్‌ ఫండ్‌ విభాగానికి పంపిస్తారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో సుమారు 7,726 మంది ఉద్యోగులకు గత నాలుగేళ్లుగా ప్రావిడెంట్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌ ఇవ్వలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సుమారు 2020-21, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు గాను ఉద్యోగులు.. ఉపాధ్యాయులు, ప్రభుత్వ సర్వెంట్లకు తమ భవిష్యనిధి ఖాతా బ్యాలెన్స్‌ షీట్లు ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతినెల కోట్ల రూపాయల సొమ్ము మినహాయింపు..

ప్రతి నెల ఉద్యోగికి మంజూరైన జీతభత్యాల నుంచి ఆయా డ్రాయింగ్‌ అథారిటీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము మినహాయించి ఫ్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలకు పంపిస్తారు. ఈవిధంగా పంపబడిన సొమ్ము ఆయా ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలలో జమ చేస్తారు. జమ చేసిన సొమ్ము వారి ఖాతాల్లోకి చేరాలి. ప్రతి ఉద్యోగికి తన సొమ్ము తమ ఖాతాలలో జమ చేయబడుతుందో లేదో అనుమానం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారికి తమ ఖాతా బ్యాలెన్స్‌ షీట్లు ప్రతి ఏడాది ఇవ్వకపోవడమే అని తెలుస్తుంది. ప్రతినెల ఒక ఉద్యోగి సగటున రూ. 7 వేల నుంచి రూ. 10 వేల వరకు సొమ్మును తన ఖాతాలోకి జమచేసుకొంటాడు. ఈ లెక్కన నెలకు రూ.5 కోట్లు సొమ్ము జమచేయబ డుతుంది. నెలకు రూ.5 కోట్లు చొప్పున ఏడాదికి 60 కోట్లు రూపాయలు సొమ్ము చేయబడుతుంది. ఈ నాలుగేళ్లలో సుమారు రూ.240 కోట్లు సొమ్ముకు జమాలెక్కలు లేకుండా పోయాయని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. గతంలో ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా బుట్టదాఖాలాలు అయ్యాయే గానీ ఈ విషయం ముందుకు సాగలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. బ్యాలెన్స్‌ షీట్‌ లేకపోవడంతో బుణ దరఖాస్తులు పెట్టుకోవడం లేదు.

పీఎఫ్‌ ఖాతా సక్రమ నిర్వహణ నిల్‌..

ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలు సక్రమ నిర్వహణ లేకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ మినహాయింపు సొమ్ము తమ ఖాతాలో ఉన్నదీ లేనిదీ తెలియక ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు పరిష్క రించాలంటూ రోడ్డు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు పీఎఫ్‌ సొమ్ములో సవరణ లు కూడా జరుగుతున్నదీ లేనిది తెలియక ఉద్యోగులు నష్టపోతున్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగికి దక్కని బ్యాలెన్స్‌ షీట్స్‌..

ఈ ఏడాది పెద్దమొత్తంలో ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు కూడా తమ భవిష్య నిధి ఖాతాల బ్యాలెన్స్‌ షీట్లు అందక తికమక పడుతున్నారు. తమ ఖాతా స్టేట్‌మెంట్ల కోసం పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరగుతున్నారు. లెక్కలు తేలక అధికారులు ఎంత సొమ్ము ఇస్తే అంతే తీసుకోవాల్సి వస్తోందని పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.