ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
మే 19న ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా మే 20వ తేదీన హిందీ పరీక్ష నిర్వహించారు.
అయితే ఆ రోజు ఓ పరీక్ష కేంద్రంలో జరిగిన హిందీ పరీక్షకు కేవలం ఒకేఒక్క విద్యార్ధి హాజరయ్యాడు. ఆ విద్యార్ధి కోసం ఏకంగా ముగ్గురు ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. వీరితోపాటు పోలీసు సిబ్బంది కూడా ఆ పాఠశాలకు కేటాయించారు. ముగ్గురు పరీక్షా నిర్వాహకుల మధ్య ఒకే ఒక్క విద్యార్థి హిందీ పరీక్ష రాయడం విశేషం. ఈ ఘటన అల్లూరి జిల్లాలోని జీ మాడుగుల మండలం కొత్తూరు బాలుర ఆశ్రమ పాఠశాల చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
అల్లూరి జిల్లాలోని జీ మాడుగుల మండలం కొత్తూరు బాలుర ఆశ్రమ పాఠశాల-1 పరీక్ష కేంద్రంలో మే 20 (మంగళవారం) నిర్వహించిన హిందీ పరీక్ష ఒకేఒక్క విద్యార్థి రాశాడు. గెమ్మెలి శివాజీ అనే విద్యార్ధి హిందీపరీక్ష రాస్తుండగా ఒక ఇన్విజిలేటర్, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డీఓ అధికారులు పర్యవేక్షించారు. వీరితోపాటు పోలీసు సిబ్బందిని ఆ కేంద్రానికి కేటాయించారు. అలాగే జీ మాడుగులలోని గురుకుల పాఠశాలలో కూడా ఇదే రీతిలో ఇద్దరు విద్యార్ధులు మాత్రమే పరీక్ష రాశారు. ఇక మండల పరిధిలోని గాంధీనగర్ కేంద్రంలో ఏడు మంది పరీక్ష రాసినట్లు ఎంఈవో చిట్టపులి బాబురావు తెలిపారు. ఆ తర్వాత రోజు నుంచి జరుగుతున్న మిగిలిన అన్ని పరీక్షలకు ఎక్కువమంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.