ఈ కారులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి! ఇది ఒక విలాసవంతమైన గది.

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ ఇండియాలో అడుగుపెట్టిన అనతి కాలంలో మంచి పేరును సంపాదించుకుంది. దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది.


2024 ఏడాదిలో కొత్త కార్లను విడుదల చేసి మెరుగైన సేల్స్‌ను నమోదు చేసిన కియా ఇండియాలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఇతర కార్ల తయారీదారుల మాదిరిగా తన మోడళ్లను ప్రదర్శిస్తుంది. కంపెనీ ఈ ఈవెంట్‌లో కార్నివాల్ హై లిమౌసిన్ (carnival hi limousine) కారును ప్రదర్శనకు ఉంచింది. ఇది ఆకట్టుకునే డిజైన్‌తో పొడవుగా లగ్జరీ సదుపాయాలను కలిగి ఉంది. కియా కార్నివాల్‌ లైనప్‌లో ఈ కొత్త మోడల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లగ్జరీ ఫీచర్స్ బొలెడు ఉన్నాయి.

కియా కార్నివాల్‌ హై లిమౌసిన్ కొన్నేళ్లుగా లభిస్తున్నప్పటికి, ఇప్పుడు మరిన్ని సొగసులు అద్దుతూ భారత్‌లో తీసుకొస్తున్నారు. ఇది ఎంపీవీ (MPV) మోడల్. ప్రీమియం వాహనాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇది వచ్చింది. ఈ కొత్త కారులో ప్రధాన అప్‌డేట్ అంటే దాని రూఫ్ అదనంగా విస్తరించారు. దీంతో లోపల విశాలమైన స్థలం ఏర్పడుతుంది. ఇది చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. రూప్‌ను స్టార్‌లైట్ థీమ్‌తో అందంగా మార్చారు.

రెండో వరుసలో రెండు పెద్ద కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఇవి ముందు కాళ్లు పెట్టుకోడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంటీరియర్ మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. విలాసవంతమైన కెప్టెన్ సీట్లు, హీటింగ్, వెంటిలేషన్ సౌకర్యాలు కలిగి ఉంటాయి. క్యాబిన్‌లో యాంబియంట్ మూడ్ లైటింగ్, 25.7-అంగుళాల పెద్ద ఆండ్రాయిడ్ టీవీ వంటి పలు ఫీచర్స్‌ను పొందవచ్చు. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇది అందిస్తుంది.

ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ప్రయాణికుల సీట్లకు కూడా అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్, హెడ్‌లైనర్, సన్ వైజర్‌లు, క్యాబిన్ లైట్లు, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్‌కు అదనంగా పనిచేసే 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 11-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే యూనిట్ (HUD), ఇతర స్మార్ట్ కనెక్టివిటీ వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి. స్లిప్‌లలో ఫుట్ మసాజర్ అనుభూతి సరికొత్తా ఉంటుంది.

అంతర్జాతీయంగా ఉన్నటువంటి కార్నివాల్ హై లిమోసిన్ 3.5L పెట్రోల్, 2.2L డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 294 hp పవర్, 355 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ 194 hp పవర్, 441 Nm గరిష్ట టార్కును విడుదల చేస్తుంది. ఈ రెండు ఆప్షన్లకు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ సిస్టం ఉంటుంది. దీంతో డ్రైవింగ్ చాలా ఈజీ అవుతుందని కంపెనీ పేర్కొంటుంది.

ప్రయాణికుల భద్రతకు సంబంధించి 8 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరాలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, స్పీడ్ సెన్స్ ఆటో డోర్ లాక్, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఇతర పలు సేఫ్టీ ప్రమాణాలను ఈ కారులో కంపెనీ అందించింది.