సైఫ్ పై దాడి చేసింది ఇతనే.. బయటికొచ్చిన ఫొటో

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడి ఫొటో బయటికొచ్చింది. ఆ ఫొటోలో దుండగుడు మెట్లపై నుంచి వస్తున్నట్లు కనిపిస్తోంది.


అయితే సైఫ్ పై దాడి చేసింది ఇతను ఒక్కడేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దర్యాప్తు పై పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. దుండగుడు అగ్నిప్రమాదాల సమయంలో ఉపయోగించే మెట్ల మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యుల పనివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై స్థానిక డీసీపీ దీక్షిత్ గేడమ్ మాట్లాడుతూ, “నిన్న రాత్రి సైఫ్ అలీఖాన్ ఇంట్లో దాడి జరిగింది. నిందితుడు ప్రత్యేక మార్గం ద్వారా ఇంట్లోకి చొరబడ్డాడు. అతడు దొంగతనానికి ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నాం. నిందితుడిని ఇప్పటికే గుర్తించాం. దర్యాప్తు కోసం పది ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి..” అని తెలిపారు.

ఈ దాడి ఘటనలో సైఫ్ వెన్నెముక భాగంలో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స ద్వారా 2.5 అంగుళాల కత్తి ముక్కను వెన్నుపూస నుంచి తొలగించారు. వెన్నుపూస ద్రవాలు లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు.

అలాగే ఎడమ చేయి, మెడ వద్ద గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స అందించింది. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో కోలుకుంటున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.