పెట్టుబడి డబుల్ అయ్యే పోస్టాఫీస్ స్కీం ఇదే.. 5 లక్షలు పెడితే చేతికి 10 లక్షలు

డబ్బుకు ప్రాధాన్యత పెరుగుతున్నా కొద్దీ ఆదాయ మార్గాల కోసం వెతుకులాట ఎక్కువై పోతున్నది. కొందరు రెండో ఆదాయం కోసం పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నారు. మరికొంత మంది ఉన్నడబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలని చూస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే భద్రతతో కూడిన గ్యారంటీ రిటర్స్న్ పొందాలనుకుంటే మాత్రం ప్రభుత్వానికి చెందిన స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా మీ పెట్టుబడి డబుల్ అయ్యే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే అది రెండింతలు అవుతుంది. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 10 లక్షలు వస్తాయి.


కిసాన్ వికాస్ పత్ర స్కీం పోస్టాఫీసులతో పాటుగా బ్యాంకుల్లో కూడా తెరవొచ్చు. ఈ పథకంలో కనిష్టంగా 1000 పెట్టుబడిపెట్టొచ్చు. గరిష్టంగా ఎంత పెట్టుబడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 9.5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంలో 7.5 శాతం వడ్డీరేటు అందించబడుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు ఒక్కరిగా లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ పథకంలో చేరొచ్చు.

5 లక్షలకి.. 10 లక్షలు:

కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.5000 ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ తర్వాత రూ.10,000 పొందుతారు. అదే రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 10 లక్షలు పొందొచ్చు. అంటే మీరు ఎంత మొత్తం పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి అది డబుల్ అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, పథకం మెచ్యూరిటీ కాలానికి అంటే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 5 నెలల్లో 10 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు. అంటే, మీరు వడ్డీ నుంచి నేరుగా 5 లక్షల రూపాయలు అందుకోవచ్చు.