చాలా మందికి కార్ల పైభాగంలో ఉండే చిన్న కొమ్ము (యాంటిన) ఎందుకు ఉంటుందో తెలియదు. అది కేవలం అందం కోసమేనా అని అనుకుంటారు. కానీ నిజం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు..
ఈ చిన్న ఆంటెన్నా కేవలం కారుకు మంచి లుక్ ఇవ్వడానికే కాదు, ఇది అనేక రకాల పనులు చేస్తుంది.. రేడియో సిగ్నల్స్ అందుకోవడం దగ్గర నుండి జీపీఎస్ నావిగేషన్‌కు సహాయం చేయడం వరకు, కీ లేకుండా కారులోకి ఎంట్రీ ఇవ్వడం నుండి టైర్ ప్రెజర్ చెప్పడం వరకు, బ్లూటూత్ కనెక్టివిటీ నుండి మొబైల్ సిగ్నల్ పెంచడం వరకు, వై-ఫై హాట్‌స్పాట్‌ను అందించడం వరకు.. ఈ చిన్న ఆంటెన్నా ఒక మల్టీటాలెంటెడ్ హీరో లాంటిది..
షార్క్ ఫిన్ యాంటిన ఎందుకు ఉంటుంది?
కొన్ని కార్ల పైభాగంలో షార్క్ చేప రెక్కలాంటి చిన్న ఆకారం ఉంటుంది కదా? అది డిజైన్ కోసం పెట్టింది కాదు.. కారు కదులుతున్నప్పుడు సిగ్నల్ బాగా అందడానికి అది ఒక ఆంటెన్నా లాగా పనిచేస్తుంది. దానివల్లే కారులోపల మొబైల్ సిగ్నల్ బాగా వస్తుంది, ఎఫ్ఎమ్/రేడియో కూడా స్పష్టంగా వినిపిస్తుంది.
రేడియో సిగ్నల్స్ కోసం: ఆంటెన్నా ముఖ్యమైన పని రేడియో సిగ్నల్స్‌ను అందుకోవడం. ఎఫ్ఎమ్, ఏఎమ్ రేడియో స్టేషన్ల నుండి వచ్చే సిగ్నల్స్‌ను ఇది పట్టుకుంటుంది. అందుకే మీరు డ్రైవ్ చేస్తూ పాటలు వినగలుగుతారు.
జీపీఎస్ నావిగేషన్ కోసం: ఈ రోజుల్లో కార్లలో జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇది దారి కనుక్కోవడానికి సహాయపడుతుంది. ఆంటెన్నా జీపీఎస్ ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకుంటుంది. మీ కారు ఎక్కడ ఉంది, ఏ దిశలో వెళ్తోంది అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
కీ లేకుండా ఎంట్రీ కోసం కూడా: కొన్ని కార్లలో కీ లేకుండానే డోర్ తెరుచుకునే, స్టార్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. మీ కారు కీ నుండి వచ్చే సిగ్నల్‌ను ఈ ఆంటెన్నా అందుకుంటుంది.
టైర్ ప్రెజర్ కోసం: ఈ ఆంటెన్నా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)లో కూడా ఒక భాగం. టైర్లలో అమర్చిన సెన్సార్ నుండి సిగ్నల్ తీసుకుని, టైర్లలో ఎంత గాలి ఉందో మీకు తెలియజేస్తుంది.
బ్లూటూత్ కనెక్టివిటీ కోసం: కొన్ని కార్లలో బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. మీ ఫోన్‌ను కారుకు కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆంటెన్నా బ్లూటూత్ పరికరం నుండి సిగ్నల్ అందుకుంటుంది. దీని ద్వారా మీరు హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ మాట్లాడవచ్చు లేదా పాటలు వినవచ్చు.
మొబైల్ సిగ్నల్ బూస్టర్: కొన్ని కార్లలో మొబైల్ సిగ్నల్ బూస్టర్ కూడా ఉంటుంది. ఈ ఆంటెన్నా మొబైల్ టవర్ల నుండి వచ్చే సిగ్నల్‌ను బలపరుస్తుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి నెట్‌వర్క్ కనెక్షన్ ఉండేలా చేస్తుంది.
వై-ఫై హాట్‌స్పాట్ కోసం: కొత్త కార్లలో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్ కూడా వస్తోంది. మీ కారులో ఇంటర్నెట్ ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆంటెన్నా వై-ఫై పరికరం నుండి సిగ్నల్ అందుకుంటుంది.