చిరంజీవి నిర్ణయంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అది సరైంది కాదు: MLC కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె రాసిన లేఖ లీక్ కావటం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కామెంట్ చేయటం, తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివ్ చేయటం వంటి పనులు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారాయి.


ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లటం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం వంటి వాటిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కేసీఆర్‌పై కోపంతోనే తనను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్నారు. తనను భయటకు తీసుకొచ్చేందుకు ఒకానొక దశలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని అన్నారు. అయితే ఆ సమయంలో తానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. పార్టీనే నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు, నాయకులు ఉంటారని వారికి అన్యాయం చేయటం సరికాదని చెప్పినట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఆ తర్వాత తీసుకున్న యూటర్న్‌తో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. రాజకీయాల్లోకి సీరియస్‌నెస్ ఉంటేనే రావాలని.. కమిట్‌మెంట్‌తో పని చేయాలని చెప్పారు.

‘కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో నన్ను జైల్లో పెట్టారు. నా వల్లే జైల్లో ఉందని భావించి కేసీఆర్ గారు నన్ను భయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయాలనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో మా ఆయన్ను కేసీఆర్ గారి దగ్గరకు పంపాను. లేదు నేను జైల్లోనే ఉంటాను.. నా కోసం మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను. పార్టీని మెర్జ్ చేయవద్దని మా ఆయనతో చెప్పించాను. నాన్న ఒకరి ముందు తలవంచడం కరెక్ట్ కాదనిపించింది. లక్షలాది మంది కార్యకర్తలు రోడ్డున పడతారు. చిరంజీవి గారు పార్టీ పెట్టి తీసేసినప్పుడు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాలిటిక్స్‌లో అలాంటి గేమ్స్ ఆడొద్దు. సీరియస్‌నెస్ ఉంటేనే పాలిటిక్స్‌లోకి రావాలి. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు చాలా సీరియస్‌గా గ్రామస్థాయిలో నిలబడతారు. అన్నీ ఫేస్ చేస్తూ మనకోసం వాళ్లు నిలబడతారు. పార్టీల కోసం ఆస్తులు, ప్రాణాలు కూడా పొగొట్టుకుంటారు. నేను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఓ అబ్బాయి గుండెపోటుతో చనిపోయాడు. పాలిటిక్స్ ఇంత సీరియస్‌గా ఉంటాయి కాబట్టే.. పార్టీని బీజేపీలో కలపాల్సిన పనిలేదు. నేను ఇంకో సంవత్సరం అయినా.. జైల్లోనే ఉంటానని కేసీఆర్ గారికి చెప్పాను.’ అని కవిత వెల్లడించారు.

కాగా, చిరంజీవి 2008 ఆగస్టు 26న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. 294 స్థానాలకు గాను 18 స్థానాలను గెలుచుకుని, మొత్తం ఓట్లలో దాదాపు 17 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, మారిన రాజకీయ పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దాదాపు 30 నెలల తర్వాత అంటే 2011 ఫిబ్రవరి 6న పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని చేసింది. 2014 నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటా సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ సినిమాలు తీస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.