ఏపీలో ఐదేళ్ల పాటు సాగిన దోపిడీ వ్యవహారం అంతా పూసగుచ్చినట్లుగా వివరించి… అసలు నిందితుల్ని జైలుకు పంపి.. తాను బయటపడేందుకు ఏపీబీసీఎల్ మాజీ ఎడీ వాసుదేవరెడ్డి సిద్ధమయ్యారు.
ఆయనపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదయింది. రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు చెందిన ఆయనను వైసీపీ నేతలు ఏపీకి పిలిపించి.. ఆయన కేంద్రంగానే మద్యం దందా చేశారు. వేల కోట్ల ఈ మద్యం స్కాంలో మొత్తం వాసుదేవరెడ్డినే ప్రధాన పాత్రధారి. అయితే ఆయన కేవలం సంతకాలకే పరిమితమని.. కొంత కమిషన్ ఇచ్చి మిగతా అంతా ప్రభుత్వ పెద్దలే తీసుకునేవారని అంటున్నారు.
తనకు కొంత విదిలించి.. మొత్తం కేసులు తనపై వేయాలని చేసిన కుట్రలపై దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఫీలవుతున్నారు. ఇప్పటికైనా నోరు తెరవకపోతే తన ఉద్యోగమే కాదు.. తన జీవితం కూడా పూర్తిగా జైలుకు పరిమితమవుతుందన్న అంచనాతో ఆయన మొత్తం వివరాలు బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని వాసుదేవరెడ్డి విల్లాలో సీఐడీ అధికారులు సోదాలు సుదీర్ఘంగా నిర్వహిస్తున్నారు. వేల కోట్లఅవినీతికి సంబంధిచిన వ్యవహారాలు బయటపడుతున్నాయి.
వాసుదేవరెడ్డి ఏపీకి చెందిన అధికారి కాదు… కనీసం ఏపీ వ్యక్తి కాదు. ఆయన తెలంగాణ వ్యక్తి. రైల్వే అధికారి. తాము చేయాలనుకున్న అవినీతికి ఓ బకరా కోసమే ఆయనను తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది. అందుకే తాను బయటపడాలనుకుంటున్నారు. అందర్నీ ముంచేద్దామనుకుంటున్నారు. ఈ విషయంలో వాసుదేవరెడ్డి అప్రూవర్ అయితే.. వైసీపీలో పై స్థాయి నుంచి విజయసాయిరెడ్డి వరకూ అందరూ మునిగిపోవడం ఖాయమే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా ఉన్న కంపెనీ ఏపీ మద్యం వ్యవహారాల్లోనూ కీలకంగా ఉంది. అదంతా బయటకు వస్తుంది.