టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్ధ శతకం (84 పరుగులు)తో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్న దశలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో విరాట్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటంటే?
టాప్ స్కోరర్‌గా : ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు బాదిన భారత బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు విరాట్ 744 పరుగులు బాదాడు. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ (701)ను అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 791 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
ఛేజింగ్‌లో రికార్డ్ : విరాట్ అంతర్జాతీయ వన్డే ఛేజింగ్‌లో 8000 పరుగుల మైలురాయి అందుకొని, ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో దిగ్గజం సచిన్ తెందూల్కర్ 8720 పరగులతో టాప్‌లో ఉన్నాడు. విరాట్ 8000+ పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరి తర్వాత కూడా భారత బ్యాటరే ఉండడం విశేషం. రోహిత్ శర్మ 6115 రన్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక హాఫ్ సెంచరీలు : ఐసీసీ వన్డే టోర్నమెంట్ (వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)ల్లో విరాట్‌కు ఇది 24వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలోనే ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలోనే తెందూల్కర్ (23) ను బీట్ చేశాడు.
అత్యధిక క్యాచ్‌లు : ఇదే మ్యాచ్‌లో విరాట్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా నిలిచాడు.ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకున్న విరాట్ ఈ ఫీట్ సాధించాడు. మూడు ఫార్మాట్లలో విరాట్ ఇప్పటివరకు 336 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ (334)ను అధిగమించాడు.