ఊబకాయం.. ఈ మధ్య చాలా మందికి ఎదురవుతున్న ఇబ్బంది. తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తున్న ఈ సమస్యకు మన దేశంలో అందుబాటులో ఉన్న ఔషధాలు అంతంతే. అందుకే ఉన్నవాటికి విపరీతంగా గిరాకీ ఉంటోంది. అమెరికా ఫార్మా దిగ్గజమైన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ విక్రయిస్తోన్న ‘మౌంజారో’ బ్రాండ్ (Weight Loss Drug Mounjaro)కు డిమాండ్ ఎక్కువగా ఉంది. విడుదల చేసిన కేవలం 3 నెలల్లోనే రూ.24కోట్ల వ్యాపారం జరిగింది.
ఈ ‘మౌంజారో’ బ్రాండు ఔషధాన్ని ఈ ఏడాది మార్చిలో కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ ఇది. సింగిల్ డోస్ వయల్ రూపంలో ఉంటుంది. స్థూల కాయం, అధిక బరువు, టైప్-2 మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ మందు అనువైనదని కంపెనీ వివరించింది. తొలి రెండు నెలల్లో కాస్త తక్కువగానే ఉన్న గిరాకీ.. మే నెలలో ఏకంగా మూడింతలు పెరగడం గమనార్హం.
ఇప్పటివరకు మొత్తంగా రూ.23.94కోట్ల విలువైన మౌంజారో వయల్స్‌ను విక్రయించినట్లు తాజా ఫార్మాట్రాక్ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో రూ.12.6కోట్ల అమ్మకాలు కేవలం మే నెలలో జరిగినవే. మొత్తంగా 81వేలకు పైగా వయల్స్ విక్రయించినట్లు ఈ గణాంకాలు పేర్కొన్నాయి.
వారానికి ఒక డోసు చొప్పున, నెలకు అవసరమైన ఈ మందుకు మన దేశంలో రూ.14,000-17,500 వరకూ ఖర్చవుతుంది. ఇదే మందు అమెరికాలో అయితే 1,000 డాలర్ల (సుమారు రూ.85,000) నుంచి 1,200 డాలర్లు (సుమారు రూ.1.02 లక్షలు) అవుతుంది. మనదేశంలో విస్తరించాలనే ఉద్దేశంతో, కొంత తక్కువ ధర నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ధర కూడా మన వాళ్లకు భారమే. అయినప్పటికీ కొనుగోలుకు చాలా మంది ఆసక్తిచూపుతున్నారు.