టీచర్లే కదా..అర్హత పరీక్షంటే భయమెందుకు?

తమ రాష్ట్ర ప్రభుత్వం 2023లో ప్రవేశ పెట్టిన అర్హత పరీక్ష నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిహార్‌ పంచాయతీ ఉపాధ్యాయులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం సరైనదేనని ప్రకటించింది. ఉపాధ్యాయుడైన ఒక పోస్టుగ్రాడ్యుయేట్‌ కనీసం సెలవు చీటీ కూడా రాయలేరా…? దేశంలో విద్యా వ్యవస్థ స్థాయి ఇదేనా? అని ప్రశ్నించింది.

ఈ అర్హత పరీక్షను రాయలేని పక్షంలో ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో పట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ… రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ బీవీ నాగరత్న డిస్మిస్‌ చేశారు.