చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు..
దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? …
మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం.
ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు.
మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?
ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో “అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.
ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం, ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది.
ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.
ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.