ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. జో రూట్ (120; 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ ఒవర్టన్ (27) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5, మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖి ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇబ్రహీం జద్రాన్ విధ్వంసం..
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. ఇబ్రహీం జద్రాన్ (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో జద్రాన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (41; 31 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), మహమ్మద్ నబీ (40; 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. హష్మాతుల్లా షాహిది (40; 67 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. తొలుత జోఫ్రా ఆర్చర్ (3/64) ధాటికి అఫ్గాన్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. హష్మాతుల్లాతో కలిసి జద్రాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత జద్రాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. 15 ఓవర్లకు 56/3 ఉన్న స్కోరు జద్రాన్ దూకుడుతో పరుగులు పెట్టింది. అతడు 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, ఒమర్జాయ్ కూడా దూకుడుగా ఆడటంతో 40 ఓవర్లకు స్కోరు 212/5కి చేరింది. సెంచరీ తర్వాత జద్రాన్ చెలరేగి ఆడాడు. ఆర్చర్ వేసిన 44వ ఓవర్‌లో ఒక సిక్స్‌తోపాటు వరుసగా మూడు ఫోర్లు బాదాడు. నబీ కూడా దూకుడు ప్రదర్శించడంతో అఫ్గాన్ భారీ స్కోరు సాధించింది.