ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..అంతకు ముందే వారి సర్వీస్ సీనియార్టీ జాబితాల తయారీపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా బదిలీలకు అవసరమైన సీనియార్టీ లెక్కింపు విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.
రాష్ట్రంలో గతంలో టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తేవి. వాటిని నివారించడానికి ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా వారి సీనియార్టీ జాబితాలు సిద్దం చేయిస్తోంది. దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ఆన్ లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. దీని తర్వాత సీనియార్టీ జాబితా విడుదల కానుంది.
అయితే టీచర్ల సీనియార్టీ లెక్కింపు విషయంలో టీచర్లు 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండానే రిక్వెస్ట్ పెట్టుకుని బదిలీ అయినా, లేక పరస్పర బదిలీల కింద స్కూల్స్ మారినా వారు తమ పాత స్కూళ్లలోనే ఉన్నట్లు లెక్కించనున్నారు. వారిని పాత స్కూల్లో ఉన్నట్లే లెక్కించి 8 ఏళ్లు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ చేయబోతున్నారు. అలాగే త్వరలో విడుదల చేసే సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే సేకరించి తుది జాబితా రిలీజ్ చేయనున్నారు. అలాగే పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు.