ఎంత సంపాదించినా పొదుపు చేయలేకపోతున్నారా?.. ఈ 5 సూత్రాలు పాటించండి

మీ ఆదాయం నుంచి మీ అవసరాల కోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోవడమే బడ్జెట్ అంటే. మీకు ఎన్ని మార్గాల నుంచి ఆదాయం వస్తుందో ముందో ఓ అంచనా వేసుకోండి. దాన్ని బట్టి మీ సేవింగ్స్ నుంచి ఎంత పక్కన పెట్టాలనుకుంటున్నారో ముందు ఫిక్స్ అవ్వండి.


కొందరు రోజంతా కష్టపడి పనిచేస్తారు. వచ్చిన జీతాన్ని అపురూపంగా చూసుకుంటారు. పట్టుమని పదిరోజులు గడిచేలోపే ఉన్న డబ్బంతా ఖర్చైపోతుంది. దీంతో చేసిన కష్టమంతా దుబారా అవుతుందనే దిగులు ఓ వైపు.. రేపటి కోసం అసలేం పొదుపు చేయలేకపోతున్నాం.. అపరాధ భావన లోలోపలే తినేస్తుంటుంది. భవిష్యత్తులో వచ్చే ఆకస్మిక అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేసే అలవాటు లేకపోతే కష్టాలు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవేవీ లేకుండా మీ బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.

మీరు ఎక్కువగా దేని కోసం ఖర్చు చేయాల్సి వస్తుందో ముందు గమనించుకోండి. అప్పుడే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. అనవసర ఖర్చులను గుర్తించి మళ్లీ వాటి జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలగాలి.

షాపింగ్ చేసేటప్పుడు..
సంపాదన మొత్తం షాపింగ్ కు వెళ్లొచ్చేసరికి ఐస్ క్యూబ్ లా కరిగిపోతుంటుంది. అందుకే ముఖ్యమైన, అవసరమైన వస్తువులేంటో బయటకు వెళ్లేముందే స్పష్టంగా అనుకోవాలి. ఆఫర్లు, కూపన్లు చూసి వాటిని ఉపయోగించుకోండి. ముఖ్యంగా షాపింగ్ చేసేటప్పుడు క్యాష్ ను క్యారీ చేసేలా చూసుకోండి.

రెండో ఇన్ కం ఉందా..?
మీకు గనుకు టైమ్, చేయగలిగే ఆసక్తి ఉంటే రెండో ఇన్ కం గురించి ప్రయత్నించండి. దీంతో మీ పైపై ఖర్చులన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అయితే అది మీ వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది లేని విధంగా సెట్ చేసుకోండి. లేదంటే అదనపు పనిభారం వల్ల వచ్చే సమస్యలతో మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే మీ సామర్థ్యాలపై మీకో ఐడియా ఉండటం మంచిది.

తెలివైన మార్గం..
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ గోల్డ్ ఇలా మీకు నచ్చిన ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని అందుకోసం కేటాయించుకోండి. ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్ రీసెర్చ్ కు ప్రాధాన్యం ఇవ్వండి. లేదంటే డబ్బు నష్టపోయే అవకాశాలే ఎక్కువ.

పెన్షన్ ప్లాన్ చేసుకున్నారా?
ప్రతి ఒక్కరు భవిష్యత్తు కోసం పెన్షన్ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఈ ఫండ్స్ లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్స్ అయితే బావుంటుంది. రిటైర్మెంట్ తర్వాత మెచ్యూరిటీపై రెగ్యులర్‌గా ఆదాయం లభిస్తుంది.

ఇన్సూరెన్స్ ఉందా..?
మీకు అత్యవసర సమయాల్లో మీ సేవింగ్స్ ను కాపాడే ఏకైక మార్గం ఇన్సూరెన్స్ మాత్రమే. ముందు జాగ్రత్తతో తీసుకునే ఈ చిన్న కవరేజీ వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో రకాల దుబారా ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు.