EV Scooters: 248 కిలోమీటర్ల మైలేజ్‌తో నయా ఈవీ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ఈవీ స్కూటర్ల వాడకాన్ని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల బాదుడుతో పాటు స్కూటర్ల నిర్వహణ నుంచి రక్షణ కోసం ఈవీ స్కూటర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ స్కూటర్లు పట్టణ ప్రాంతంలో ప్రయాణించడానికి సులువుగా ఉన్నా దూర ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రం ఈవీ స్కూటర్లు మైలేజ్‌పరంగా వెనుకపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్టప్ సింపుల్ వన్ 248 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది.


క్లీన్ టెక్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది . సింపుల్ వన్‌కు సంబంధించిన జెన్ 1.5 వెర్షన్ ఐడీసీలో 248 కిలోమీటర్ల విస్తరించిన సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంది. సింపుల్ వన్ జెన్ 1 స్కూటర్ 212 కిలోమీటర్ల పరిధి అందిస్తుంటే తాజా అప్‌డేట్ జెన్ 1.5 248 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే యాప్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, అప్‌డేటెడ్ రైడ్ మోడ్‌లు, పార్క్ అసిస్ట్, ఓటీఏ అప్‌డేట్స్, బ్రేకింగ్, ట్రిప్ హిస్టరీ & స్టాటిస్టిక్స్, అనుకూలీకరించిన డాష్ థీమ్‌లు, ఫైండ్ మై వెహికల్ ఫీచర్, రాపిడ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఆటో బ్రైట్‌నెస్ వంటి కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ ఇప్పటికే సింపుల్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రస్తుత సింపుల్ వన్ యజమానులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా స్కూటర్ తాజా వెర్షన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. సింపుల్ వన్ జెన్ 1.5 ధరను జెన్ 1 ధర మాదిరిగానే రూ.1,66,000 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా ప్రకటించారు.

సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్‌ 750 వాట్స్ ఛార్జర్‌తో కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అంటుంది. అలాగే ఈ స్కూటర్ 30+ లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌‌తో వస్తుంది. అప్‌డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 సాఫ్ట్‌వేర్ సరికొత్త ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అధునాతన స్మార్ట్ టెక్, కనెక్టివిటీ లక్షణాలతో వినియోగదారులకు రియల్-టైమ్ డేటా, రిమోట్ యాక్సెస్, రైడ్ గణాంకాలను అందిస్తుంది. అలాగే రైడర్లు అంతర్నిర్మిత టర్న్-బై-టర్న్ మ్యాప్‌లతో సులభంగా నావిగేట్ చేయవచ్చు. ఆటో బ్రైట్‌నెస్, వ్యక్తిగతీకరించిన టోన్‌లు మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. మెరుగైన సామర్థ్యం కోసం పునరుత్పత్తి బ్రేకింగ్, వేగవంతమైన బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన లక్షణాలు రైడర్లకు కొత్త అనుభవాన్ని ఇస్తాయి.

ఈ స్కూటర్ లాంచ్‌పై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ రిలీజ్ చేసినట్లు తెలిపారు రైడర్లకు రేంజ్ ఆందోళన లేకుండా అధిక మైలేజ్‌తో స్కూటర్ రిలీజ్ చేశామని స్పష్టం చేశారు. సింపుల్ వన్ విస్తరణ ప్రణాళికలు అమల్లో ఉన్నాయని చెప్పారు. 2019లో స్థాపించిన సింపుల్ ఎనర్జీకి ఇప్పుడు బెంగళూరు, గోవా, పూణే, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కొచ్చిలలో 10 స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఇప్పుడు 150 కొత్త స్టోర్లు, 200 సర్వీస్ సెంటర్లతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.