శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్లు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్ట పగలు గ్రామాల్లోకి చొరపడుతూ స్వైర విహారం చేస్తున్నాయి.
బుధవారం మధ్యాహ్నం వజ్రపు కొత్తూరు మండలం కొండపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. క్లాసులు జరుగుతుండగా ఓ ఎలుగుబంటి పాఠశాల ఆవరణలోకి చొరబడి తీవ్ర భయాందోళనలను సృష్టించింది. కాసేపు పాఠశాల గ్రౌండ్‌లో కలియ తిరుగుతూ బాత్రూమ్ పక్క నుంచి కొండపైకి వెళ్ళిపోయింది ఎలుగు బంటి. ఎలుగుబంటిని దగ్గరగా చూసిన విద్యార్థులు, ఉపాద్యాయులు హడలిపోయారు. తలుపులు వేసుకొని కొద్దిసేపటి వరకు విద్యార్థులు, ఉపాద్యాయులు తరగతి గదుల్లోనే బిక్కు బిక్కుమంటూ మగ్గిపోయారు.
అయితే ఆ సమయంలో విద్యార్థులు ఎవరు ఎలుగుబంటికి ఎదురు కాకపోవటం.. కాసేపు అవరణలో తిరగాడుతూ అది తోటలలోకి వెళ్ళిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. పట్టపగలు స్కూల్ ఆవరణలోకి ఎలుగుబంటి రావడంతో ఉపాద్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెoదుతున్నారు. పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి రక్షణ కల్పించాలని గ్రామస్తులు, ఉపాద్యాయులు కోరుతున్నారు. కిందటి వారం ఇదే మండలంలోని ఎం.గడూరు, డేప్పూరు గ్రామాలలో రెండు ఎలుగుబంట్లు తిరిగాడుతూ నలుగురుపై దాడి చేయడంతో.. ఇప్పుడు ఎలుగుబంటి అంటేనే ఉద్దాన ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో పాఠశాల ఆవరణలోకే ఏకంగా ఎలుగుబంటి ప్రవేశించడంతో అందరూ ఉలిక్కి పడుతున్నారు. పైగా ఈ పాఠశాల ప్రహరీకి ఆనుకునే కొండ, దట్టమైన తోటలు ఉండటంతో ఏ క్షణాన ఏ అడవి జంతువు పాఠశాల ఆవరణలోకి ప్రవేశిస్తుందో.. ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఇక్కడ బిక్కుబిక్కుమంటూనే చిన్నారులకు విద్యా బోధన కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు. పాఠశాల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలంటూ గతంలో పలుసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని అయినా పట్టించుకున్న దాఖలాలు లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.