ఇల్లు అనేది ఒక కల. సొంత ఇల్లు అనేది ఉంటే.. మనం తిన్నా.. తినక పోయినా.. ఇంట్లో గుట్టుగా బతికేయ వచ్చు. ఇది సామాన్య మధ్య తరగతి మనిషి తాలుక ఆలోచన.
అందుకోసం ఏళ్లకు ఏళ్లు తరబడి కష్టించి పని చేస్తాడు. రూపాయి రూపాయి కూడబెట్టి.. ఓ ఇల్లు నిర్మించుకొంటాడు. అలాంటి వారి కోసం 2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా దేశంలోని సామాన్య మానవుడు సైతం సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే.. అతడికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అంటే వేడి నీళ్లకు చన్నీళ్లన్నమాట.
ఆదాయం ఆధారంగా ఈ పథకం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందగలుగుతారు. అయితే ఈ పథకంతో బలహీన వర్గాలు, స్వల్ప ఆదాయ వర్గాలతోపాటు మధ్య ఆదాయ వర్గాలకు బహుళ ప్రయోజనాలు అందనున్నాయి. నేటి వరకు కోట్లాది మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. అవి ఎలాగంటే..
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. బలహీన వర్గాలు(EWS), స్వల్ప ఆదాయ వర్గాలు(LIG)తోపాటు మధ్య ఆదాయ వర్గాలు(MIG) అనే మూడు వర్గాలకు ప్రయోజనాలు అందించబడతాయి. బలహీనవర్గాలు (EWS) అంటే.. వారికి వార్షికంగా రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాలు.. వీరు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. వీరితోపాటు స్పల్ప ఆదాయ వర్గంతోపాటు మధ్య ఆదాయ వర్గం ప్రజలు.. వారి వార్షిక ఆదాయం రూ. 3 నుంచి రూ. 6 లక్షల వరకు.. అలాగే రూ.6 నుండి రూ.12 లక్షల వరకు ఉంటుంది, వారు సైతం ఈ పథకం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే.. ఇలా చేయాలి..
ఈ పథకానికి మీరు అర్హులైతే.. మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా.. సమీపంలోని ప్రభుత్వ బ్యాంకు లేదా అధీకృత కేంద్రం నుంచి సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
వీరికి మాత్రం ఈ పథకం వర్తించదు.. ఎందుకంటే..?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఇప్పటికే ఎవరైనా వారి కుటుంబ సభ్యులు పేరు మీద పక్కా ఇల్లు ఉంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ గృహా నిర్మాణ పథకం ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ.. మీరు ఈ పథకం యొక్క ప్రయోజనం పొందలేరు.