గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇవాళ అమరావతిలో గుర్తింపు పొందిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరిపారు.
17 గుర్తింపు పొందిన గ్రామ వార్డు, ఉద్యోగ సంఘ నేతలు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలు చెప్పుకున్నారు.
రేషనలైజేషన్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మూడు కేటగిరీలుగా సచివాలయాలు, ఉద్యోగులు ఉన్నారు. 2,500 జనాభా కంటే తక్కువ ఉన్న సచివాలయం పరిధిలో ఆరుగురు ఉద్యోగులు, 2500-3500 వరకూ జనాభా ఉన్న సచివాలయంలో పరిధిలో ఏడుగురు ఉద్యోగులు, 3,500 జనాభా కంటే ఎక్కువ ఉన్న చోట్ల ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.
రేషనలైజేషన్ పై ఆయా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తరువాత ప్రభుత్వానికి బాల వీరాంజనేయ స్వామి రిపోర్టు ఇస్తారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వేయాలని, లైన్ డిపార్ట్మెంట్లలో కలపాలని వినతులు వచ్చాయి.
ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. “ఏబీసీ కేటగిరీలుగా వీరిని రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించాం. సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమించి, సర్వీసు నిబంధనలు రూపొందిస్తాం. రేషనలైజేషన్ విషయంపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుంది. రేషనలైజేషన్ ప్రక్రియతో కొందరిని తొలగిస్తారన్న అపోహలు సృష్టిస్తున్నారు.
ఎవరిని తొలగించబోవటం లేదు. కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. మహిళా పోలీసుల విషయంలోనూ మహిళా శిశుసంక్షేమశాఖ, హోం శాఖను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకుండా పదోన్నతులు ఎలా వస్తాయి?” అని అన్నారు.