ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక.. టోకెన్లు ఎక్కడ పొందాలి?

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని, ఉచిత ఇసుక కూపన్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్లను అప్పగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.


ములుగు మండలంలోని ఇంచెర్ల గ్రామంలో ఆయన మంత్రి సీతక్కతో కలిసి బుధవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు ఐటీడీఎ పరిధి దృష్ట్యా మరో 1500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. అయితే మంత్రి సీతక్క అభ్యర్ధన మేరకు మరో 1000 ఇందిరమ్మ ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. లబ్దిదారులు మరో 10-15 రోజుల్లో ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ప్రతి సోమవారం వారికి నిధులను విడుదల చేస్తామన్నారు.

అదేవిధంగా ఈ ప్రాంతంలోని అటవీభూములలో ఇంతవరకు చిన్నపాటి ఇంటిని కలిగి అందులో నివసిస్తున్న ప్రజలకు అక్కడే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించాలంటూ అటవీ అధికారులను ఆదేశిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో చెంచులకు ప్రత్యేకంగా 10 వేల ఇండ్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంజూరు చేశామని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని అర్ధమని గతంలో కాంగ్రెస్ 9 సంవత్సరాల పాలనా కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు 25.50 లక్షల ఇండ్లు ఇచ్చిందని గుర్తుచేశారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలు రాజ్యమేలినా కేవలం 92 వేల ఇండ్లకు ఆమోదం తెలిపి 60 వేల ఇండ్లను మాత్రమే పూర్తిచేసిందన్నారు. 30 వేలకు పైగా ఇండ్లు మొండిగోడలతో మిగిలిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు. కట్టిన ఇండ్లకు గాను కాంట్రాక్టర్లకు కూడా డబ్బు చెల్లించలేదన్నారు. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లిస్తూనే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను నెలకు 6500 కోట్ల రూపాయిలు మిత్తీగా కడుతూనే భారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంకల్పించిందని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం కనీసం 60 మంది వరకు అర్హులైనవారు ఉన్నారని, ఇప్పుడు ఒక్కో గ్రామానికి 25 ఇండ్లు మాత్రమే ఇచ్చే వీలుందని భవిష్యత్తులో అన్ని గ్రామాలలోని అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు తప్పక వస్తాయని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 22,500 కోట్ల రూపాయిలతో నాలుగేళ్ళలో 20 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించామని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల సోమ్మును సొంత షోకుల కోసం ఖర్చుచేస్తే నేటి ఇందిరమ్మ ప్రభుత్వం పైసా పైసా కూడబెట్టి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఖర్చు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను గమనించి రానున్న స్దానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి పొంగులేటి కోరారు. భూభారతికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా వారి భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.

టోకెన్లు ఎలా పొందాలంటే..?

ఇందిరమ్మ ఇండ్ల ఒక్కో లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. లబ్ధిదారులు గ్రామ కార్యదర్శి ఇచ్చిన ధృవపత్రాన్ని తీసుకుని తహసీల్దారు కార్యాలయంలో అందజేయాలి. అక్కడ ఏ వాగు నుంచి ఇసుకను పంపిణీ చేయాలో చెప్పి.. టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్ల ద్వారా లబ్ధిదారులు స్వయంగా ఇసుకను తీసుకువెళ్లాలి. ఉచిత ఇసుక కూపన్ల పంపిణీ బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.