తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, వసతి గదులను బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జులై నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఇవాళ వర్చువల్ సేవల కోటా విడుదల చేయనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలతో పాటుగా వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను నేడు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 23న‌ ఉదయం 10 గంటలకు జులై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జులై నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటా కూడా అందుబాటులోకి రానుంది.
మరోవైపు ఏప్రిల్ 24న ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటా విడుదల చేయనుంది టీటీడీ.. ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఏప్రిల్ 24 మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిల‌లో జూలై నెల గదుల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే తిరుమల శ్రీవారి సేవ కోటాను ఏప్రిల్ 27న ఉదయం 11 గంటలకు.. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జులైలో తిరుమల వెళ్లాలని భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.