మహిళలకు తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో తీపి కబురు చెప్పింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడకుండా.. వారి జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కొత్త స్టాంప్ సవరణ బిల్లు-2025 తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించేలా నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్లలో ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఒకవేళ కొత్త స్టాంప్ సవరణ బిల్లు-2025 అమల్లోకి వస్తే ఆస్తి విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ విధించే అవకాశం ఉంది.
ఇందులో రిజిస్ట్రేషన్, బదిలీ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు, ఆస్తి మొత్తం విలువలో 1.5 శాతం బదిలీ సుంకం చెల్లించేలా చట్టంలో పొందుపరచనున్నట్లుగా సమాచారం.