హెల్త్ ఇన్సురెన్స్ ఉందా.. ఎవరికి ఎంత కవరేజీ ఉండాలి?

ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో జాయిన్ అయితే లక్షలకు లక్షలు పోయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులో చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ తీసుకున్నా అరకొర ప్రీమియంతో పాలసీలు తీసుకుని పెద్ద సమస్య వచ్చినప్పుడు మిగతా డబ్బులు ఆస్పత్రుల్లో కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికి ఇంకా చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ మధ్యకాలంలో వైద్య ఖర్చులు ఊహించని విధంగా పెరిగిపోయాయి. చిన్నపాటి జబ్బులకే లక్షల్లో ఖర్చవుతోంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా తక్కువ ఇన్సురెన్స్ తీసుకుంటే, ఆసుపత్రి బిల్లులు చూసి షాకవ్వడమే కాకుండా, మానసికంగా కూడా కుంగిపోతాం. అయితే ఎంత బీమా ఉంటే సురక్షితంగా ఉంటామో, ఎందుకు ఎక్కువ కవరేజ్ అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


వైద్య ఖర్చులు అనేవి ప్రతేడాది పెరుగుతూనే ఉంటాయి. 2025లో వైద్య చికిత్స ఖర్చులు 13 శాతం వరకు పెరగనున్నాయని ఒక నివేదిక చెబుతోంది. గతేడాది ఇది 12 శాతం ఉండగా, ఇది ప్రపంచ సగటు కంటే కాస్త ఎక్కువ. కరోనా తర్వాత ఆసుపత్రి ఖర్చులు ఇంకా పెరిగిపోయాయి. సాధారణ ధరలు పెరిగే వేగం కంటే వైద్య ఖర్చులు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. అంటే, గతేడాది ఒక లక్ష ఖర్చయితే ఇప్పుడు దానికి రూ.1.13 లక్షలు అవుతుందని అర్థం. చిన్నపాటి చికిత్సలకు కూడా సగటున రూ.70 వేలకు పైగా ఖర్చవుతోంది.

అందుకే ఎంత హెల్త్ ఇన్సురెన్స్ కవరేజ్ తీసుకోవాలి అని చాలా మంది కన్ఫూజన్లో ఉన్నారు. ఇది మీరు ఉండే ఊరు, మీ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ, మీ హెల్త్ స్టేటస్, ఉద్యోగంలో ఒత్తిడి, అలవాట్లు, జీవనశైలి వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. పట్టణాల్లో సగటున రూ.4.8 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.6 లక్షల వరకు కవరేజ్ అవసరమని ఓ అంచనా. అయితే, దేశవ్యాప్తంగా సగటున రూ.3.3 లక్షల కవరేజ్ మాత్రమే ఉంది. ఇది పెద్ద జబ్బులకు ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం ఏమాత్రం సరిపోదు.

గుండె జబ్బులు వంటివి ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి లక్షల్లో ఖర్చవుతుంది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు మందులు, రెగ్యులర్ చెకప్స్ వంటివి ఉంటాయి. ఇన్సురెన్స్ ఉంది అంటే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక రోజు గది అద్దెకే రూ.6 వేల నుంచి రూ.15 వేలు అవుతుంది. ఐసీయూ ఖర్చులు ఇంకా ఎక్కువ. మన లైఫ్ స్టైల్, కాలుష్యం వల్ల బీపీ, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. కాబట్టి, కొంచెం ఎక్కువ హెల్త్ కవర్ తీసుకోవడం అవసరం.

లక్షలకు లక్షలు కవరేజ్ తీసుకోవడం ఆర్థిక భారం అనుకుంటే, ‘సూపర్ టాప్-అప్’ అనే మార్గం చాలా మంచిది. ఇవి మనపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. సాధారణ హెల్త్ పాలసీలతో పాటు, రూ.10-25 లక్షల వరకు సూపర్ టాప్-అప్‌లు తీసుకోవచ్చు. మన ప్రధాన పాలసీలోని డబ్బులు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ టాప్-అప్‌లు పనిచేస్తాయి. ఉదాహరణకు, మీకు రూ.10 లక్షల పాలసీ ఉండి, రూ.10 లక్షల సూపర్ టాప్-అప్ ఉంటే, మీ మొదటి రూ.10 లక్షలు ఖర్చయిన తర్వాతే ఈ టాప్-అప్ యాక్టివ్ అవుతుంది. వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి సూపర్ టాప్-అప్‌లకు ఏడాదికి రూ.2,000-6,000 వరకు ప్రీమియం ఉంటుంది.

చిన్న చిన్న అవసరాలకు హెల్త్ ఇన్సురెన్స్ వాడకపోవడమే మంచింది. ఎందుకంటే, క్లెయిమ్ చేయకపోతే ‘నో క్లెయిమ్ బోనస్’ ద్వారా మీ కవరేజ్ పెరుగుతుంది. రూ.10 లక్షల కవరేజీ ఎక్కువని మాత్రం అనుకోకండి. ఏదైనా పెద్ద జబ్బు వస్తే, అప్పటిదాకా మీరు కూడబెట్టిన డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. రూ.3-4 లక్షల కవరేజీతో పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి, టాప్-అప్‌లను ఖచ్చితంగా ఎంచుకోండి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.