టెట్ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. డీఎస్సీ లేకుండా ఎస్జీటీ ఉద్యోగం పొందాలంటే.

ప్రభుత్వ ఉద్యోగం చాలామంది నిరుద్యోగుల కల. అందుకోసం ఏళ్ల తరబడి నోటిఫికేషన్‌ల కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే ప్రిపరేషన్ మొదలుపెట్టేస్తారు.


ఒక్కసారి ప్రభుత్వం జాబ్ ప్రకటన విడుదల చేయగానే అప్పులు చేసి మరీ కోచింగ్‌, స్టడీ సెంటర్లలో వాలిపోతారు. ఇంటికి దూరంగా ఉంటూ పగలనక రాత్రనక గంటల తరబడి పరీక్షలకు సన్నద్ధమవుతారు. గ్రూప్స్, కానిస్టేబుల్ ఇలా ఏ జాబ్ సాధించాలన్నా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా ఎన్నో స్టేజీలు దాటుకుంటూ వెళ్లాలి. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలనుకునేవారు ముందుగా టెట్ రాయాలి. తర్వాత డీఎస్సీ. టెట్‌లో మంచి ర్యాంక్ వచ్చిన వారికే జాబ్ వచ్చే అవకాశాలు అధికం. అందుకే టెట్ స్కోరు పెంచుకునేందుకు ఒకటికి రెండుసార్లు రాస్తుంటారు. డీఎస్సీ పరీక్ష మార్కులకు టెట్ మార్కులు యాడ్ చేయడమే అందుకు కారణం. సాధారణంగా టెట్ పరీక్ష రాశాక స్కూల్ అసిస్టెంట్ (SA)లేదా సెకండరీ గ్రేడ్ టీచర్( SGT) ఉద్యోగం పొందాలంటే డీఎస్సీ స్కోరు తప్పనిసరి. అయితే, డీఎస్సీ మార్కులతో పనిలేకుండా కేవలం టెట్ స్కోరుతోనే ఈ ఉద్యోగాలు చేజిక్కించుకునే అవకాశం వస్తే.. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా.. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే సాధ్యమే..

ప్రభుత్వ టీచర్ కావడమే మీ జీవిత లక్ష్యమా. ఇప్పటికే టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పాసై ఉన్నారా. అయితే, మీ కల నిజమైనట్టే. డీఎస్సీ మార్కులతో అవసరం లేకుండానే ఎస్జీటీ ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రకటనను హన్మకొండలోని ఓ పాఠశాల విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నశ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాల నుంచి ఈ ప్రకటన వెలువడింది. తాజాగా విడుదలైన ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాల ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపల్ లక్ష్మీనర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్కూల్‌లో ఖాళీగా ఉన్న3 ఎస్జీటీ గెస్ట్ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు జస్ట్ టెట్ పాసై ఉంటే చాలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేవారు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంటి ఇంటర్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (డీఈడీ, హెచ్.ఐ) తప్పనిసరిగా పాసై ఉండాలి. అదే విధంగా టెట్ కూడా అర్హత సాధించి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు వరంగల్ ఎన్ఐటీ సమీపంలోని టీటీడీ బధిరుల పాఠశాలలో నవంబరు 5వ తేదీ లోపు విద్యార్హతలు, వయసు, కులం, నివాసానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు రెండు సెట్ల జిరాక్సు కాపీలను సమర్పించాలని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. పోస్టులకు దరఖాస్తు చేసినవారికి నవంబరు 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ జరుగుతుంది.