మందుబాబులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలోకి కొత్త బీరు బ్రాండ్లు

తెలంగాణకు త్వరలో కొత్త రకం బీర్లు రానున్నాయి. బీర్ల ఉత్పత్తికి ముందుకొచ్చే మద్యం కంపెనీలను ఆహ్వానించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.


ఆ కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎక్సైజ్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. కొత్తరకం బ్రాండ్లు మద్యం షాపుల్లోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. తెలంగాణలో బీర్ల ధర పెరగకపోవచ్చునని రేవంత్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఇది ఇలా ఉంటే బీర్ల ధర పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల రేట్లు పెంచాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఎక్సైజ్ శాఖకు సీఎం రేవంత్ సూచించారు.

వారానికి సరిపడే ‘కేఎఫ్’నిల్వలు

తెలంగాణలో ప్రస్తుతం కింగ్ ఫిషర్ బీర్లు ఆరు లక్షల కేసుల నిల్వలు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) సంస్థ సరఫరా చేసే ఈ రకం బీరు వారంపాటు మద్యం డిపోలకు సరఫరా చేయవచ్చునని ఆ శాఖ లెక్కలు కట్టింది. బేసిక్ ధర పెంచని కారణంగా తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా చేయలేమని యూబీ ప్రకటించింది. ఈ ప్రకటన విడుదలైన నాటికి.. తెలంగాణలో కేఎఫ్ రకం బీర్లు 14లక్షల కేసులు ఉన్నట్టు అంచనా. తెలంగాణలో అన్ని బ్రాండ్లు బీర్లు కలిపి రోజుకు లక్ష కేసుల వరకూ, పండుగ పూట లక్ష యాభై వేల కేసుల బీర్ల వరకూ అమ్మకాలు జరుగుతాయని అంచనా. కేఎఫ్ బీర్ల నిల్వలు తగ్గినప్పటికీ మిగతా కంపెనీ బీర్ల నిల్వలకు కొరత లేదని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీల బీర్లు అందుబాటులో ఉన్నాయని వివరిస్తోంది. 2023-24లో బీర్ల సెల్స్ 547.95 లక్షల కేసుల కాగా, అందులో అందులో యూబీ సేల్స్ 382.73లక్షల కేసులుగా నమోదయ్యాయి. 2024-25లో బీర్ల సేల్స్ 413 లక్షల కేసులు కాగా యూబీ సేల్స్ 275.22 లక్షల కేసులుగా రికార్డు సృష్టించింది. దీనిని పరిశీలిస్తే కేఎఫ్ బీర్లకు డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో 8 బీర్ల కంపెనీలు దరఖాస్తులు

తెలంగాణకు గతంలో బీర్లు సరఫరా చేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. గతంలో లక్ష రూపాయల డిపాజట్ సమర్పించే కంపెనీలు దరఖాస్తు చేసుకునేవి. ప్రభుత్వ అనుమతి పొందిన తరువాత బీర్లు సరఫరా చేసేవి. ఇది ఇలా ఉంటే..గత మార్చిలో బీర్ల సరఫరాకు ఎనిమిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆ కంపెనీలకు అనుమతులు మంజూరు కాలేదు. బీర్లలో ఆల్కాహాల్ శాతం, బీరు ధరను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ శాఖ అనుమతులు మంజూరు చేయలేదని తెలుస్తోంది.

గుత్తాధిపత్యానికి తలొగ్గం: జూపల్లి

రాష్టంలో మద్యం సరఫరాదారులు గుత్తాధిపత్యం చేయడానికి ప్రయత్నించారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ధ్వజమెత్తారు. 33 శాతం వరకూ బీరు ధర పెంచమని డిమాండ్ చేయడంతో తాము తలొగ్గలేదని ఆయన తెలిపారు. బీర్ల ధర పెంపు విషయంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామన్నారు. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కంపెనీల డిమాండ్ మేరకు 33 శాతం ధర పెంచితే.. బీర్ల ధరలు భారీగా పెరుగుతాయని జూపల్లి అంచనా వేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణలో బీర్ల ధర తక్కువేనన్నారు. కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180, మహరాష్ర్టలో రూ.200, తమిళనాడులో రూ.150లకు దొరికే బీరు ..తెలంగాణలో రూ.150కే లభిస్తోందన్నారు.

కేఎఫ్ బీర్ల తయారీ నిలిపివేత

బీరు ధరలో తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమేనని యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ లెక్కలు కడుతోంది. బీరు ధరలో 70శాతం వరకూ ప్రభుత్వ పన్నులు ఉంటాయని స్పష్టం చేస్తోంది. తెలంగాణలో సరఫరా అవుతున్నా బీర్లలో 72శాతం బీర్లు తమ సంస్థవేనని తెలియజేస్తోంది. ఇదిఇలా ఉంటే.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసే కింగ్ ఫిషర్ బీర్ల తయారీని నిలిపివేస్తున్నట్టు యూబీ ఇటీవల ప్రకటించింది. యూబీ నిర్ణయంతో ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోయాయి. బీర్ల ధర పెంపు జరగడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌కు ఆ సంస్థ ఇప్పటికే తెలియజేసింది. తెలంగాణలో 2019 నుంచి రేట్లలో మార్పు జరగకపోవడంతో కంపెనీకి భారీ నష్టాలు వచ్చినట్టు పేర్కొంది. గత ఐదేళ్లుగా కంపెనీ ఆదాయంలో తగ్గుదల భారీ స్థాయిలో కనిపిస్తోందని యూబీ ఆందోళన చెందుతుంది.