సుకన్య సమృద్ధి, కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లను తనిఖీ చేయండి

పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఎలాంటి రిస్క్ లేని పథకాల్లో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనిలో చిన్న మొత్తాల పొదుపు స్కీములు చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.


ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పొదుపు స్కీము(Small Savings Scheme)ల్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలు(Government schemes) కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. అంతేకాదు కేంద్రం మద్దతుతో గ్యారెంటీ రిటర్న్స్ కూడా వస్తాయి.

చిన్న మొత్తా(Small Savings Scheme)ల్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ అనేదే ఉండదు. దాదాపు అన్ని వర్గాల వారి కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇక్కడ నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం..నిర్ణీత కాలానికి రాబడి కూడా వస్తుంది. అందుకే వీటిల్లో ఆయా స్కీముల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అయితే అత్యంత ప్రజాదారణ పొందిన సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. మరి వేటిల్లో ఇప్పుడు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

సాధారణంగా ఈ పోస్టాఫీస్ స్కీము(Post Office Scheme)ల్లో వడ్డీ రేట్లను కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. కొన్నిసార్లు వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా కొన్ని సార్లు తగ్గవచ్చు. ఇంకొన్నిసార్లు స్థిరంగా కూడా ఉండవచ్చు. అయితే దాదాపు గా ఏడాది కాలంగా వీటిల్లో వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచుతోంది. ఇప్పుడు 2025 జనవరి-మార్చిలో కూడా వడ్డీరేట్లను మార్చలేదు. ఈ స్కీములో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund): ఈ స్కీముకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇందులో వడ్డీ రేటు 7.10శాతంగా ఉంది. ఇందులో వరుసగా 15ఏళ్ల డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80సి కింద ట్యాక్స్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఏడాదికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(Senior Citizen Savings Scheme): ఈ స్కీము కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇందులో వడ్డీ రేటు 8.20 శాతం ఉంది. మెచ్యూరిటీ 5ఏళ్ల ఉంటుంది. అవసరం అయితే మరో 3ఏళ్లు పొడిగించుకోవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ వడ్డీ రేటు ప్రకారం..ప్రతి మూడేళ్లకు ఓసారి చేతికి డబ్బులు అందుతాయి.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్ స్కీమ్(Post Office Time Deposits Scheme): ఈ స్కీములో ఏడాది టెన్యూర్ పై 6.9శాతం వడ్డీ రేటు ఉంటుంది. 2,3,5 ఏళ్ల డిపాజిట్లపై వరుసగా 7,7.10, 7.50శాతం వడ్డీరేటు ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ స్కీములో 7.40శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ 5ఏళ్లుగా ఉంటుంది. సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ. 9లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ. 15లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(National Savings Certificate) : ఈ స్కీములో ఐదేళ్ల లాగిన్ పీరియడ్ ఉంటుంది. వడ్డీ రేటు 7.70శాతంగా ఉంది.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్(Kisan Vikas Patra Scheme) : ఈ స్కీములో వడ్డీ రేటు 7.50శాతం ఉంది. ఇక్కడ 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్(Mahila Samman Savings Certificate): ఈ స్కీములో స్థిరంగా 7.50శాతం వడ్డీ రేటు ఉంటుంది. లాగిన్ పీరియడ్ రెండేళ్లు ఉంటుంది. గరిష్టంగా రూ. 2లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మార్చి 2025 వరకు అవకాశం ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ(Sukanya Samriddhi Yojana interest): ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ స్కీములో వడ్డీ రేటు 8.20 శాతం ఉంటుంది. ఇక్కడ చిన్నారి పదేళ్లలోపు వయస్సులోనే చేరాలి. వరుసగా 15ఏళ్లు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అకౌంట్ తీసుకున్న 12ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది.