మహీంద్రా ఈవీలకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌

ప్రముఖ వాహన తయారీ సంస్థ, మహీంద్రాకు సంబంధించిన BE 6, XEV 9e eSUVలు భారత్‌-NCAPలో రికార్డు స్థాయిలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌లను సాధించాయి. పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో అద్భుతంగా రాణించాయి. మహీంద్రా & మహీంద్రా..XEV 9e భద్రత కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పెద్దల రక్షణ పరీక్షల్లో కచ్చితమైన 32/32 స్కోర్‌ను సాధించింది, BE 6 31.93/32 స్కోర్‌ చేసింది. ఈ రెండు పిల్లల రక్షణ పరీక్షల్లో 45/49 స్కోర్ చేసాయి. ఈ స్కోర్స్‌తో రెండు వాహనాలు సురక్షితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మాత్రమే కాకుండా ప్రస్తుతం దేశంలో భారత్‌-NCAP ద్వారా అంచనా వేసిన SUVల్లో అత్యంత సురక్షితమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి.


BE 6, XEV 9e ఇప్పుడు మహీంద్రాకు సంబంధించిన 5 స్టార్‌ రేటెడ్‌ వాహనాల లైనప్‌లో చేరాయి. ఇందులో థార్‌ ROXX, XUV 3XO, XUV400, XUV700, స్పార్పియో-N వంటివి ఉన్నాయి. eSUVల్లో 360 డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఒక ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ బూస్టర్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, బ్లైండ్‌ వ్యూ మానిటర్‌, సురక్షిత 360 లైవ్‌ వ్యూలతో కూడిన వివిధ అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇలాంటి సాంకేతిక ఫీచర్లతో BE 6, XEV 9eలు కేవలం సురక్షితమైనవే కాకుండా అత్యంత అధునాతనమైన, వినూత్నమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తాయని మహీంద్రా & మహీంద్రా తెలిపింది.