ఎల‌క్ట్రిక్ కారు ఈ-విటారాను ఆవిష్క‌రించిన మారుతీ సుజుకీ

మారుతీ సుజుకీ నుంచి ఎల‌క్ట్రిక్ కారు వ‌చ్చేసింది. తొలి బ్యాట‌రీ కారు ఈ-విటారాను ఇవాళ ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఢిల్లీలో జ‌రిగిన ఈమెంట్‌లో ఆ కారును ప్ర‌ద‌ర్శించారు. వంద దేశాల‌కు ఆ కారును ఎగ‌మ‌తి చేయ‌నున్న‌ట్లు కంపెనీ చెప్పింది.


మారుతీ సుజుకీ కంపెనీ ఇవాళ ఎల‌క్ట్రిక్ కారు ఈ-విటారా(eVITARA)ను ఆవిష్క‌రించింది. తొలిసారి మారుతీ కంపెనీ బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని లాంచ్ చేసింది. ఈ కారును సుమారు వంద దేశాలకు ఎగుమతి చేయ‌నున్న‌ది. ఢిల్లీలోని భార‌త్ మొబిలిటీ ఆటో షోలో ఈ-విటారా మోడల్‌ను రిలీజ్ చేశారు. ఈ నేప‌థ్యంలో సుజుకీ మోటారు ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ మాట్లాడుతూ.. ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ మోడ‌ల్‌ను.. యురోప్,జ‌పాన్‌తో పాటు వేర్వేరు ప్రాంతాల‌కు ఎగుమ‌తి చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

మారుతీ సుజుకీ ఇండియా కంపెనీలో 58 శాతం వాటా సుజుకీ మోటార్ కార్పొరేష‌న్‌కు ఉన్న‌ది. అయితే ఈ మోడ‌ల్ కార్ల ఉత్ప‌త్తి కోసం ఇండియాను హ‌బ్‌గా మార్చుకోవాల‌ని ఆ కంపెనీ భావిస్తున్న‌ది. గుజ‌రాత్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో ఈ-విటారా కార్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ-విటారాలో రెండు బ్యాట‌రీల ఆప్ష‌న్ క‌ల్పించారు. 49kWh , 61kWh బ్యాట‌రీలు దీంట్లో ఉంటాయి. సింగిల్ ఛార్జ్‌తో ఇది సుమారు 500 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దు.