Nallamala forest garbage collecting : రెండు తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద అడవి ఏదయ్యా అంటే.. దానికి నల్లమల అనే సమాధానం వస్తుంది. నల్లమల అడవి రెండు తెలుగు రాష్ట్రాలకు ఊపిరి పోసే తల్లి లాంటిది.
అయితే ఈ అడవిలో గత కొంతకాలంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకు పోతున్నాయి. ఈ వ్యర్ధాలను తిని జంతువులు చనిపోతున్నాయి. తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వ్యర్ధాల ఏరివేతకు నడుం బిగించడం లేదు. అడవిలో కనిపించిన వ్యర్ధాలు మిగతా వారికి పెద్దగా ఇబ్బంది కలిగించలేదు గాని.. అతనికి మాత్రం గుండెను బరువెక్కించాయి. బాధను కలిగించాయి. జంతువుల దుస్థితిని చూసి కన్నీరు పెట్టేలా చేశాయి. ప్రతి అతడు నల్లమల్ల ప్రక్షాళనకు నడుం బిగించాడు. ఒకరకంగా ఈ కాలపు హరిత పుత్రుడయ్యాడు.
అతడి పేరు జాజి.. పూర్తి పేరు కొమెర అంకారావు. అతడు పుట్టింది నల్లమల్ల అడవికి దగ్గర్లో ఉన్న ఓ గ్రామంలో. దూర విద్యలో రెండు పీజీలు పూర్తి చేశాడు. వారంలో ఐదు రోజులు తన ద్విచక్ర వాహనం మీద నల్లమల అడవిలోకి వెళ్తాడు. అక్కడ కనిపించే ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తాడు. వాటిని తన సంచిలో వేసుకొని.. చెత్త ఏరుకునే వాళ్లకు ఇస్తాడు. ఒకటి కాదు రెండు కాదు చాలా సంవత్సరాల నుంచి అతను ఇలాగే చేస్తున్నాడు. ఇక వర్షాకాలం మొదలుకాగానే విత్తనాలను తీసుకెళ్తాడు.. రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాలలో చల్లి వస్తాడు. ఆ తర్వాత అవి అంకురించాయో లేదో అని చూస్తాడు.. ఒకవేళ అవి గనుక అంకురాలుగా మారితే ఏదో ఒక రూపంలో రక్షణ చర్యలు తీసుకొని వస్తాడు. సంవత్సరాలుగా అతడు ఇదే దినచర్యను అవలంబించాడు. ద్వారా రోడ్డు పక్కన మినీ అడవులను సృష్టించాడు. ప్రభుత్వాలు కోట్లు ఖర్చుపెట్టి.. వందల సంఖ్యలో సిబ్బందిని నియమించి మొక్కలు నాటుతున్నప్పటికీ కలగని ప్రయోజనాన్ని జాజి చేసి చూపించాడు. అంతేకాదు ప్రకృతి పాఠశాల పేరుతో ఒక పుస్తకాన్ని సొంతంగా రాశాడు. ఇక తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ఐదు వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాడు. అతడు చేసిన హరిత కృషిని గుర్తించి ది వీక్ మ్యాగజైన్ అతని మీద ఏకంగా ప్రత్యేక కథనం రాసింది.
అడవుల పరిరక్షణ కోసం తపిస్తూ.. పుడమి శుభ్రత కోసం కృషి చేస్తూ.. జంతువులు ప్లాస్టిక్ వ్యర్ధాలు తినకుండా కాపాడుతూ.. భూమ్మీద మనిషిగా పుట్టినందుకు.. తన వంతుగా పరిరక్షణ బాధ్యత మోస్తూ.. ఫారెస్ట్ మ్యాన్ గా అవతరించిన జాజిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది.. అంతేకాదు అతడిని ఏకంగా అటవీ పరిరక్షణ సలహాదారుడిగా నియమించింది.. సలహాదారుడుగా నియమితుడైనప్పటికీ కూడా ఇప్పటికీ అతడు తన బాధ్యతను పక్కన పెట్టలేదు. భుజానికి సంచి వేసుకుని అడవిలో ఉన్న వ్యర్ధాలను సేకరిస్తున్నాడు. వాటిని చెత్త ఏరుకునే వాళ్లకు ఇస్తున్నాడు.. అంతేకాదు రోడ్డు పక్కన విత్తనాలు చల్లుతూ పుడమిపై పచ్చని వర్ణాన్ని అద్దుతున్నాడు.