అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్‌కుమార్ రమేశ్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన..
ప్రమాద క్షణాలను (Air India Plane Crash) గుర్తుచేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికిబయటపడ్డానన్నారు.
”నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు” అని విశ్వాస్ కుమార్ (Vishwash Kumar Ramesh) చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. వాటినుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా డీడీ న్యూస్ మీడియాతో మాట్లాడారు.
ఆసుపత్రిలో విశ్వాస్ కుమార్‌ను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ
”అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నా. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లా. మంటల ధాటికి నా ఎడమ చేయికి గాయమైంది” అని విశ్వాస్ తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్‌కుమార్.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్సు ఎక్కారు. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
గురువారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా.. విశ్వాస్ ఒక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల బీజే వైద్య కళాశాల వసతిగృహంలో మరో 24 మంది మృతి చెందారు.