Private Schools and Degree Colleges లకు లోకేష్ బిగ్ న్యూస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యామంత్రిగా ఏరికోరి బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్.. ఇప్పుడు తన శాఖలో కీలక సంస్కరణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీచర్లపై పనిభారం తగ్గింపు, బోధనేతర పనులకు దూరంగా ఉంచడం వంటి చర్యలు తీసుకున్న మంత్రి లోకేష్..


ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్.. అనంతరం కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు, డిగ్రీ కాలేజీలు ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్.. వారి సమస్యలు విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం సంస్కరణల దిశగా వెళుతోందని, కాబట్టి వాటికి సహకరించాలని వారిని కోరారు. ఇందులో భాగంగా వారికి కావాల్సిన వెసులుబాట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్లు, డిగ్రీ కాలేజీల గుర్తింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు గడువు ప్రస్తుతం ఎనిమిదేళ్లుగా ఉంది. అంటే ఓసారి గుర్తింపు తీసుకుంటే అది 8 ఏళ్ల వరకూ వర్తిస్తుంది. దీన్ని పదేళ్లకు పెంచాలని వాటి యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తికి లోకేష్ అంగీకరించారు. అలాగే గుర్తింపు కోసం ఇచ్చే అనుమతుల్ని కూడా సులభతరం చేయాలని యాజమాన్యాలు చేసిన వినతికి సరేనన్నారు. దీంతో పాటు మరికొన్ని ఇతర వినతులకూ సానుకూలంగా స్పందించారు.

మరవైపు రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఏటా ఇస్తుండగా.. దాన్ని ఐదేళ్లకు పెంచుతామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఒకే అనుబంధ గుర్తింపు ఫీజు ఉండేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు పాత డిగ్రీ కాలేజీలతో పాటు కొత్త వాటికి కూడా అదనపు కోర్సులకు అనుమతులు ఇవ్వాలని కోరగా.. సరేనన్నారు. ఎంసెట్ లో కటాఫ్ 25 శాతం మార్కుల నుంచి 45 శాతానికి పెంచాలన్న వినతినీ పరిశీలిస్తామన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఫీజుల రీయింబర్స్ మెంట్ చేయాలని కూడా యాజమాన్యాలు కోరాయి. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం జాబ్ మేళాలు పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని వారు కోరారు.