అమెరికా వీధుల్లో ఇప్పుడు యుద్ధ సెగ కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధం మొదలై 8 వారాలు గడుస్తున్న వేళ సామాన్యుడి జేబుకు తగులుతున్న ఇంధన మంటలు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి.
అగ్రరాజ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికన్ల జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. కేవలం వారం రోజుల్లోనే ధరలు 35 సెంట్లు పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ సగటు ధర 4.40 డాలర్లు అంటే సుమారు రూ.365 చేరింది. ఇది నాలుగేళ్లలో గరిష్ట స్థాయి. “కారులో గ్యాస్ కొట్టించుకోవాలా? లేక ఇంట్లోకి ఆహారం కొనాలా?” అనే క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలకు ఎదురవుతోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ధర గ్యాలన్‌కు 6 డాలర్లు దాటేసింది. రేటు కొద్దిగా తక్కువ ఉన్న స్టేషన్ల దగ్గర వాహనదారులు గంటల తరబడి క్యూ కడుతున్న దృశ్యాలు అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, డీజిల్ ధరలు గ్యాలన్‌కు దాదాపు 2 డాలర్లు పెరగడం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ట్రక్కులు, రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అవసరం. దీంతో రవాణా ఖర్చులు పెరగడంతో కిరాణా షాపుల్లో సరుకుల ధరలు రెట్టింపు అయ్యాయి. డెలివరీ సర్ ఛార్జీలు పెరిగాయి. తాము ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పదు.. ఇది సింపుల్ మ్యాథ్స్ అంటూ వాషింగ్టన్‌కు చెందిన ఒక వ్యాపారి పేర్కొన్నారు.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇరాన్ యుద్ధం అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలే. ప్రపంచ ముడి చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. అమెరికా దిగ్బంధం, యుద్ధం కారణంగా ఇక్కడి నుండి చమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు భగ్గుమంటున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ముగియగానే గ్యాస్ ధరలు రాయిలా కిందికి పడిపోతాయని హామీ ఇచ్చారు. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం మరోలా చెబుతున్నారు. యుద్ధం ఆగిపోయినా, సప్లై వ్యవస్థలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి, ఇంధన మార్కెట్ స్థిరపడటానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సమ్మర్ వెకేషన్స్ సీజన్ దగ్గరపడుతున్న వేళ.. అమెరికన్లు తమ జర్నీ ప్లాన్స్ రద్దు చేసుకుంటూ ఇంటికే పరిమితమవుతున్నారు. యుద్ధం సరిహద్దుల్లోనే కాక ప్రతి అమెరికన్ వంటగదిలోనూ సెగలు పుట్టిస్తోంది ఇప్పుడు.















