రాయలసీమ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పదం పౌరుషం. రాయలసీమ వాళ్ల ఆ పౌరుషం గొడ్డుకారం నుంచే వస్తుందని చెబుతుంటారు. గొడ్డుకారం రాయలసీమ వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది.
రాయలసీమకు చెందిన ప్రజలు ఈ గొడ్డు కారం తినేందుకు బాగా ఇష్టపడతారు. అందుకే అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా గొడ్డు కారం మాత్రం తప్పక ఉంటుంది. ఈ కారం అన్నంలోకి, దోసెల్లోకి, ఇడ్లీలోకి,ఇతర టిఫిన్లలోకి చాలా బాగుంటుంది.
గొడ్డు కారం తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అలాంటి గొడ్డుకారాన్ని రాయలసీమ స్టైల్ లో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.
గొడ్డు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిరపకాయలు-25
-ఉల్లిపాయలు- 2
-వెల్లుల్లి-12 రెబ్బలు
-చింతపండు- నిమ్మపండు సైజు అంత
-జీలకర్ర-1 టీస్పూన్
-ఆవాలు- 1/2 టీస్పూన్
-నూనె- 2 టేబుల్ స్పూన్లు
-ఉప్ప
-కరివేపాకు
గొడ్డు కారం తయారీ విధానం
-ముందుగా ఎండుమిర్చిని శుభ్రంగా కడిగి, వాటిని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి.
-ఉల్లిపాయలను కూడా చిన్నగా తరుగుకోవాలి.
-వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వాటిని కూడా చిన్నగా తరుగుకోవాలి.
-చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టాలి.
-ఒక మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-నానబెట్టిన చింతపండును పిండి, దాని రసాన్ని కూడా మిశ్రమంలో కలపాలి.
-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేయాలి.
-నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి.
-కరివేపాకు వేగిన తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాన్‌లో వేసి బాగా కలపాలి.
-మిశ్రమాన్ని మీడియం మంట మీద 5-10 నిమిషాలు వేయించాలి.
-కారం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వాలి. అంతే గొడ్డు కారం రెడీ. ఫ్రిజ్‌లో 1-2 వారాల వరకు ఈ కారాన్ని నిల్వ చేసుకోవచ్చు.
-మీరు కారంను మరింత రుచిగా చేయాలనుకుంటే, కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు.
-చల్లారిన తర్వాత కారాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.