SBI home loan: ఎస్‌బీఐ గృహ రుణ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈఎంఐ

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) తమ గృహరుణ వినియోగదారులకు (Home loan) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్‌ (EBLR), రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్లను (RLLR) తగ్గించింది. సవరించిన రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును 6.50 శాతం నుంచి 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్‌ఆర్‌, బీపీఎల్‌ఆర్‌ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.


గృహ రుణాలకు రెపోరేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్‌ఆర్‌ విధానాన్ని 2019 అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ అనుసరిస్తోంది. ఆర్‌బీఐ రెపోరేటు మార్చినప్పుడల్లా ఈ రేటు మారుతూ ఉంటుంది. తాజాగా ఈబీఎల్‌ఆర్‌ను 9.15 శాతం నుంచి 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 8.90 శాతానికి చేర్చింది. దీంతో ఈబీఎల్‌ఆర్‌తో అనుసంధానం అయిన హోమ్‌లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, ఇతర రిటైల్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

ఆర్‌బీఐ రెపో రేటుకు అనుసంధానం అయిన ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ సైతం 25 బేసిస్‌ పాయింట్లను ఎస్‌బీఐ తగ్గించి 8.50 శాతానికి తగ్గించింది. దీంతో గృహ రుణాలు, బిజినెస్‌ రుణాలు ఆ మేరకు తగ్గనున్నాయి. ఈ రెండు రకాల వడ్డీ రేట్లను ఎస్‌బీఐ తగ్గించిన నేపథ్యంలో ఆయా రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది. ఆమేర రుణ గ్రహీతలు ఈఎంఐలు గానీ, చెల్లించే కాలవ్యవధిని గానీ తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుంది. మరిన్ని వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి. రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును సవరించిన నేపథ్యంలో ఇప్పటికే కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రెపో ఆధారిత రుణ రేట్లను 0.25 శాతం మేర తగ్గించాయి.